ఆశలు.. సజీవ దహనం | - | Sakshi
Sakshi News home page

ఆశలు.. సజీవ దహనం

Jul 5 2025 5:50 AM | Updated on Jul 5 2025 5:50 AM

ఆశలు.

ఆశలు.. సజీవ దహనం

సాక్షి, వరంగల్‌: అతనికి.. భార్య, ఇద్దరు పిల్లలు.. హ్యాపీ లైఫ్‌.. టెంపరరీ లారీడ్రైవర్‌గా పనిచేస్తూ పోగేసుకున్న డబ్బులతో ఇటీవల గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పాలు పొంగించి తాత్కాలికంగా ఉంటున్నాడు. ఇల్లులోకి వెళ్లే కార్యక్రమం ఉంది. ఆ శుభకార్యం చేసే హడావుడిలో ఉన్నాడు. ఈక్రమంలోనే లారీ కిరాయికి వెళ్లిన అతడిని మృత్యువు మరో లారీ రూపంలో కబళించింది. ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని రాంధన్‌తండాకు చెందిన గుగులోతు గణేశ్‌ (30) తాత్కాలిక లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో అనసూయతో పెళ్లి జరిగింది. ఆయనకు రెండు సంవత్సరాల బాబు, 15 నెలల పాప ఉన్నారు. గ్రామంలో ఇటీవల కొత్త ఇల్లు కట్టుకున్నాడు. టెంపరరీ డ్రైవర్‌ కావడంతో ఎవరు కిరాయికి పిలిస్తే వారికి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే గురువారం కరీంనగర్‌లోని పద్మావతి గ్రానైట్‌ నుంచి లోడ్‌ లారీతో కాకినాడకు బయలుదేరాడు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో లారీ యజమాని యాకూబ్‌ని మార్గమధ్యలోని తన స్వగ్రామమైన ఇల్లందలో దింపాడు. అనంతరం బయలుదేరాడు. శుక్రవారం తెల్లవారుజామున మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ కుడియాతండా వద్ద వరంగల్‌–ఖమ్మం 563 జాతీయ రహదారిపై రాజస్థాన్‌కు చెందిన మరో లారీ.. రోడ్డుపై గుంతను తప్పించబోయి ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో ఇద్దరు లారీడ్రైవర్లు, మరో క్లీనర్‌ సజీవదహనమయ్యారు.

బూడిదే మిగిలింది..

గణేశ్‌ నడుపుతున్న గ్రానైట్‌ లారీని.. రాజస్థాన్‌కు చెందిన లారీ హైవేపై గుంతను తప్పించబోయి అదుపు తప్పి ఎదురుగా ఢీకొట్టింది. అది కూడా.. వస్తున్న గ్రానైట్‌ లారీ డీజిల్‌ ట్యాంక్‌ సమీపంలో బలంగా ఢీ కొట్టడంతో ట్యాంకు పగిలి ఉవ్వెత్తున మంటలు ఎగిశాయి. భారీ గ్రానైట్‌ బండలు రెండు లారీల క్యాబిన్ల వైపు రావడంతో నుజ్జునుజ్జు కావడం, అందులో లారీడ్రైవర్లు, క్లీనర్‌ ఇరుక్కుపోవడంతో బయటికి రాలేక మంటల్లో సజీవదహనమయ్యారు.

బోరున విలపించిన భార్య

భర్త లారీ క్యాబిన్‌లో కూర్చున్నచోటే బూడిద కావడంతో ఘటనాస్థలానికి చేరుకున్న భార్య అనుసూయ ఆ దృశ్యాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక ఇద్దరు పిల్లలు అమాయకంగా చూస్తుండడంతో అక్కడున్న వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిపెడ ఘటనలో వర్ధన్నపేటవాసి మృతి

భర్త బూడిద చూసి విలపించిన భార్య

ఆశలు.. సజీవ దహనం 1
1/1

ఆశలు.. సజీవ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement