
కాలనీల్లో దుర్గంధం
● శిథిలావస్థకు చేరిన డ్రెయినేజీని చూపిస్తున్న ఈ వ్యక్తి పేరు అఖిల్. నర్సంపేట పాకాల సెంటర్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న మురుగు కాల్వను అధికారులు మరమ్మతులు చేయడం లేదని తెలిపాడు. దీంతో వర్షం పడితే వరద, మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నా. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఈ పరిస్థితి నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలతోపాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొంది.
కాల్వలు లేక రోడ్లపై
ప్రవహిస్తున్న మురుగునీరు
● దోమలు, ఈగలతో
వ్యాధుల బారిన ప్రజలు
● జీడబ్ల్యూఎంసీ, పట్టణాల్లో
అస్తవ్యస్తంగా డ్రెయినేజీ
నర్సంపేట: వర్షాకాలం వ్యాధులు విజృంభిస్తున్నాయి. డ్రెయినేజీల్లో పారాల్సిన మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. వర్షాలు కురిస్తే డ్రెయినేజీలు పొంగిపొర్లి నీరు రోడ్లు ప్రవహిస్తోంది. దీంతో కాలనీల్లో దుర్గంధం వ్యాపించి వ్యాధులబారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని పాలకులు, అధికారులు..
జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌లో స్వ చ్ఛత,పరిశుభ్రతపై పాలకులు, అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా శిథిలావస్థకు చేరిన మురుగుకాల్వలే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి నిధులు, పనులు కాగితాలకే పరిమితమై కాంట్రాక్టర్ల దోపిడీకి నిలయంగా మారాయి. ఎన్నికలు వచ్చాయంటే అభివృద్ధిపై గొప్పలు చెప్పుకునే రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నామమాత్రంగా చెత్త తొలగింపు..
వరంగల్ జిల్లా కేంద్రం తర్వాత నర్సంపేటను ప్రధాన పట్టణంగా చెప్పుకుంటారు. 24 వార్డులు ఉండగా విలీన గ్రామాలతో కలిపి వార్డుల సంఖ్య 30కి చేరింది. 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో డ్రెయినేజీ వ్యవస్థ ఉంది. ఇందులో 90 శాతం కూడా కాల్వలను నిర్మించని పరిస్థితి నెలకొంది. 29 మంది స్వీపర్లు, 18 మంది నైట్ వర్కర్లు, 24 మంది డ్రెయినేజీ క్లీనర్లు, ఒకరు జేసీబీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, 24 మంది ఆటోడ్రైవర్లు, ఏడుగురు జవాన్లతో కలిపి 127 మంది సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ డ్రెయినేజీల్లో చెత్త తొలగింపు ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంది.
నోటీసులకే పరిమితం...
పట్టణంలోని ఓపెన్ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, మురుగునీరు, వర్షపు నీరు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్లాట్ల యజమానులదే. వారు పట్టించుకోకపోవడంతో ఓపెన్ ప్లాట్లలో మురుగు నీరు పేరుకుపోయి దోమలకు నిలయంగా మారాయి. గత పట్టణ ప్రగతిలో వీటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన నోటీసులు తాత్కాలిక హెచ్చరికలుగానే మారాయి. ప్రతీ వర్షాకాలంలో ఓపెన్ ప్లాట్లు చిన్నపాటి చెరువులుగా మారుతున్నాయి. వాస్తవానికి నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ పట్టణ ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లు ఎన్ని ఉన్నాయో కూడా అధికారుల వద్ద లెక్కలు లేవు.
నర్సంపేట పట్టణ వివరాలు..
జనాభా : 60 వేలు
వార్డులు : 30
అంతర్గత రోడ్ల విస్తీర్ణం : 180 కిలోమీటర్లు
డ్రెయినేజీలు : 350 కిలోమీటర్లు
సీసీ డ్రెయినేజీలు : 243 కిలోమీటర్లు
కచ్చా నాలాలు : 113 కిలోమీటర్లు

కాలనీల్లో దుర్గంధం

కాలనీల్లో దుర్గంధం