
ఘనంగా కుమార షష్టి ఉత్సవం
గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలి నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కుమార షష్టి పూజలు ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల కుమారుడు కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరుడు) సర్పరూపంలో కొలువుదీరిన ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో మూల విరాట్‌కు, వల్మీకలో వశించు నాగేంద్రస్వామి వారికి పంచసూక్త విధానంలో వైభవంగా అభిషేకం చేశారు. అనంతరం రెల్లుగడ్డి, మల్లెపూలతో అలంకరించారు. అర్చనలు, మంత్ర పుష్పతీర్థ వితరణ తదితర పూజా కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకుడు శ్రీహర్ష నిర్వహించారు. ఆలయ చైర్మన్ బాబూరావు, వీరారావు, క్లర్క్ రమేశ్, కొత్తగట్టు రాజేందర్, భక్తులు పాల్గొన్నారు.