
‘పంచాయతీ’కి ముందస్తు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 210 గ్రామపంచాయతీలు, 12 మండల పరిషత్‌లు, 1,986 వార్డులు, అంతే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కలను కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అధికారులు సరిచేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేసి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు.
మొత్తం ఓటర్లు 3,72,646
జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,772 మంది పురుషులు, 1,90,872 మంది మహిళలు, ఇతరుల కేటగిరీలో ఇద్దరు ఓటర్లుగా నమోదై ఉన్నారు. గ్రామాల్లో 1,169 పోలింగ్ కేంద్రాల్లో 200కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 755 పోలింగ్ కేంద్రాల్లో 201నుంచి 400 మంది ఓటర్లు ఉన్నారు. 62 కేంద్రాల్లో 401 నుంచి 650 మంది వరకు ఉన్నారు. మొత్తం 1,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే బ్యాలెట్స్ ప్రింటింగ్, ఇతర స్టేషనరీ సిద్ధంగా ఉంది. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంతం ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది ఎన్నికలకు సంబంధించి ముందస్తు పనులు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ, ముందస్తుగా పనులు చేస్తున్నట్లు తెలిపారు.