
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశ మహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కపాలినిగా, షోఢశీక్రమాన్ని అనుసరించి భోగబేరాన్ని భగమాలినిగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. సినీ నటులు కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.