
మత్తు రహిత సమాజాన్ని నిర్మించాలి
రామన్నపేట: మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ ఎంజీఎం చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నివారించాలనే నినాదంతో ముందుకెళ్తున్నామని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యాసంస్థల్లో డ్రగ్స్ నివారణ కమిటీలు వేయాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ అందరం ముందడుగు వేసి వరంగల్‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ జన్ను షీభారాణి, ట్రైనీ కలెక్టర్లు జయసింహ, హరిప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, అధికారులు, సీడీపీఓలు, పోలీస్ అధికారులు, మెప్మా సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
బీవీ నిర్మలా గీతాంబ
ఖిలా వరంగల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలా గీతాంబ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌ను కుంగదీసే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం సరదగా మొదలై వ్యసనంలా మా రుతుందని వివరించారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతారన్నారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్‌స్పెక్టర్ రమేశ్, లీగల్ కౌన్సిల్ పి.శ్రీనివాస్‌రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ, కృష్ణవేణి, సిల్వర్ క్రౌన్ హైస్కూళ్ల నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణి
మాదకద్రవ్యాల నిర్మూలనపై
అవగాహన ర్యాలీ

మత్తు రహిత సమాజాన్ని నిర్మించాలి