
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆత్మకూరు(దామెర): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. దామెర మండలం ల్యాదెల్లలో నూతనంగా నిర్మిస్తున్న మినీ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ వద్ద బుధవారం దామెర, ఆత్మకూరు, పరకాల, నడికూడ మండలాల మహిళలకు పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నైపుణ్యాల అభివృద్ధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని ఆర్థిక ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. వీ హబ్ సీఈఓ సీత మాట్లాడుతూ.. మహిళలు శిక్షణను వినియోగించుకోవాలని, ఆర్థిక ప్రయోజనాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ నవీన్‌కుమార్, ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ జ్యోతి, వరలక్ష్మి దేవి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
దామెరలో బుధవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేగంగా నిర్మించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి వెంట అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల తనిఖీ
దామెర మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఎంపీపీఎస్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి అక్కడున్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. ఉన్నత పాఠశాలలోని 6, 9వ తరగతులను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో కొద్దిసేపు మాట్లాడారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, స్థానిక తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంఈఓ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మహిళల నైపుణ్యాలపై అవగాహన సదస్సు

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి