
లక్ష్యసాధనలో తోడ్పాటు అందించాలి
న్యూశాయంపేట: ప్రాధాన్యత రంగాలకు రుణాల పంపిణీ మరింత పెంచాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్‌లతో డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాల మంజూరు గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు ప్రభుత్వ శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. లీడ్ బ్యాంక్ ద్వారా 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక క్రెడిట్ ప్లాన్ కింద రూ.9274.25 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ప్రభుత్వం యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంపొందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి పథకాల ఏర్పాటులో సంబంధిత శాఖలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో పంట రుణాలకు రూ.1,802.08 కోట్లు రైతులకు అందించాలనే లక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు రూ.1,702.కోట్లు అందించినట్లు తెలిపారు. వ్యవసాయరంగంలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,785.18కోట్లు లక్ష్యం పెట్టుకోగా రూ.3,653 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాజిక భద్రత పథకంలో భాగంగా పీఎం జీవన్‌జ్యోతి పథకంలో నామినికి రూ.రెండు లక్షల చెక్కును కలెక్టర్ అందించారు. సమావేశంలో డీసీసీ కన్వీనర్ ఎల్డీఎం యూబీఐ హావేలీ రాజు, యూనియన్ బ్యాంకు ఆర్‌హెచ్ కమలాకర్, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్, నాబార్డ్ ఏజీఎం చైతన్యరవి, బ్యాంకర్ రవి, జిల్లా అధికారులు అనురాధ, బాలకృష్ణ, సురేష్ పాల్గొన్నారు.
వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి :
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ రామకృష్ణారావు
న్యూశాయంపేట: ప్రజల భాగసామ్యంతో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆన్‌లైన్ ద్వారా ఈ కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా గ్రామీణాభివృద్ధి, కుడా, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఇతర శాఖల సమన్వయంతో జిల్లాలో 31 లక్షల ప్లాంటేషన్ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో 57,850 దరఖాస్తులు స్వీకరించామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి, డీఎఫ్‌ఓ అనుజ్ అగర్వాల్, పీఈ హౌజింగ్ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
బ్యాంకర్‌లతో
డీసీసీ డీఎల్‌ఆర్సీ సమావేశం