
పచ్చదనం పరిఢవిల్లేలా..
నెక్కొండ: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం జిల్లాలోని 337 నర్సరీల్లో 32,02,510 మొక్కలను పెంచుతున్నారు. ఈసారి 31,04,272 మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఏ ప్రాంతాల్లో ఎన్ని నాటాలో ఆయా మండలాల అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది 70 నుంచి 80 రకాల మొక్కలు నాటనున్నారు. నర్సరీల్లో పెంచుతున్న పలు రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను కాపాడేందుకు ఉపాధి హామీ పథకం కింద సంరక్షకులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. నాటిన ఒక్కో మొక్కకు రూ.150 ఖర్చుచేసి రెండేళ్ల వరకు కాపాడనున్నారు. మొత్తం 26 శాఖలు పచ్చదనం పరిఢవిల్లేలా కృషిచేయనున్నాయి.
ఒక్కో నర్సరీకి రూ.1.40 లక్షల ఖర్చు
ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లాలోని 323 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. వీటితోపాటు అటవీ శాఖ రెండు, జీడబ్ల్యూఎంసీ నాలుగు, నర్సంపేట మున్సిపాలిటీ 7, వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఒకటి చొప్పున నర్సరీలు ఉన్నాయి. మొత్తం 337 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో నర్సరీలో సుమారు 10 వేల మొక్కలు పెంచే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం నర్సరీకి సుమారు రూ.1.40 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. నర్సరీల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించారు.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు..
నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎండ నుంచి సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సరీలకు షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయడంతోపాటు రోజుకు రెండుసార్లు నీటిని అందిస్తున్నారు. ఈ ఏడాది అన్ని నర్సరీలు డీఆర్‌డీఓ, అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆయా నర్సరీలను పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. జూలై మొదటి వారం నుంచి విద్యాసంస్థలు, వసతిగృహాలు, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వనమహోత్సవానికి
అధికారుల ప్రణాళికలు
జిల్లాలోని 337 నర్సరీల్లో
32,02,510 మొక్కలు సిద్ధం
జూలై మొదటి వారం నుంచి
నాటేందుకు సన్నాహాలు
26 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందజేస్తాం..
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం 337 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. జూలై మొదటి, రెండు వారాల్లో మొక్కలు నాటుతాం. వీటితోపాటు ప్రతి ఇంటికి ఆరు పండ్లు, పూలు, ఔషధ మొక్కలు అందజేస్తాం. ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వనమహోత్సవ లక్ష్య సాధనకు కృషిచేస్తాం. – కౌసల్యాదేవి, డీఆర్‌డీఓ

పచ్చదనం పరిఢవిల్లేలా..

పచ్చదనం పరిఢవిల్లేలా..