
అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
న్యూశాయంపేట: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి అధికారులు సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని, కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తమదని జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, కోచైర్‌పర్సన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కలెక్టరేట్‌లో ఎంపీ పోరిక బలరాంనాయక్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ కేంద్రం నిధులతో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కేంద్ర పభుత్వ పరిధిలోని 29 శాఖల పనితీరుతోపాటు వరంగల్ జిల్లాలో సాగు నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రాజెక్టులకు నిధులు తెచ్చి జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్తామని చెప్పారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలో ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేవశించారు. ట్రాన్స్‌జెండర్లు గౌరవంగా బతికేందుకు సాయం అందించాలని కోరారు. వరి, ఇతర పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎయిడెడ్ పాఠశాలల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గాల వారీగా పరిష్కరించిన సమస్యలను అధికారులు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో
కొట్లాడి నిధులు తెస్తాం
దిశ చైర్మన్ పోరిక బలరాంనాయక్, కోచైర్‌పర్సన్ కడియం కావ్య
కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి
మానిటరింగ్ కమిటీ సమావేశం