
కొలతల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలి
దుగ్గొండి/నల్లబెల్లి: ప్రభుత్వ కొలతల ప్రకారమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. దుగ్గొండి మండలం తొగర్రాయి, నల్లబెల్లి మండలంలోని నందిగామ, రేలకుంట, రంగాపురం, మూడుచెక్కలపల్లి, ముచ్చింపుల గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ముచ్చింపులలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ కొలతల ప్రకారం కాకుండా ఇళ్లు నిర్మించుకుంటే బిల్లులు ఇచ్చేటప్పుడు సమస్యలు వస్తాయన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తానని, అర్హులకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బిల్లులను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమచేస్తోందని పేర్కొన్నారు. తొగర్రాయిలో జరిగిన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నర్సంపేటఅధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, దుగ్గొండి మండల అధ్యక్షుడు ఎర్రల్ల బాబు, గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ శారద, నల్లబెల్లి మండలంలో జరిగిన కార్యక్రమాల్లో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ, నాయకులు చిట్యాల తిరుపతిరెడ్డి, మాలోత్ రమేశ్ పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి