
లారీ, బైక్ ఢీ.. కాంగ్రెస్ నాయకుడి దుర్మరణం
● ఎల్కతుర్తిలో ఘటన
ఎల్కతుర్తి: లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ సమీపంలోని హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి చోటు చే సుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన బాషబోయిన రవి(45) వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై హనుమకొండకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఎల్కతుర్తి సమీపంలోని కార్మెల్ స్కూల్ సమీపం వద్దకు రాగానే హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న లారీ.. ఢీ కొట్టింది. దీంతో రవి బైక్‌పైనుంచి పడి తలకు తీవ్రగాయాలై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, మృతుడు రవి గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సూరారం గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశాడు. అలాగే ఎంపీటీసీగా పోటీచేసి కొద్ది ఓట్లతోనే ఓటమి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.