
అద్దె ఇంటిలో గేట్‌పల్లి పాఠశాల
నెక్కొండ: మండలంలోని గేట్‌పల్లి ప్రాథమిక పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది. ఐదేళ్ల క్రితం పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. ప్రమాదం పొంచి ఉండడంతో చెట్లకిందే విద్యార్థులకు చదువులు కొనసాగాయి. పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకురాలు సలీమా ఇంటి ఆవరణను అద్దెకు తీసుకున్నారు. దీంతో గతేడాది నుంచి అక్కడే విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలలో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు రూ.900 అద్దె చెల్లిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యాంసుందర్ తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.