
మొక్కుబడిగా బడిబాట
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తూ.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నా తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల నిర్వహించిన బడిబాటలో పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈనెల 19వ తేదీతో (గురువారం) ముగియనుంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలతోపాటు వివిధ అంశాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. బడిబాటలో భాగంగా ర్యాలీలు, ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తించడం వారి పేర్లు నమోదు చేసుకోవడం వంటివి చేసి పాఠశాలల్లో చేర్పించాలనే ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రభ్వుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. బడిబాట ముగింపు దశకు వచ్చినా అనుకున్న మేర విద్యార్థులు ప్రభు త్వ పాఠశాలల్లో చేరడం లేదనేది స్పష్టమవుతోంది. అసలు విద్యార్థులు లేని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటికి సర్దుబాటు తప్పదని భావిస్తున్నారు.
గురుకుల పాఠశాలల ప్రభావం..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం బడిబాట నిర్వహించినా గురుకులాల్లోనే ఎక్కువగా విద్యార్థులు చేరుతున్నారనేది స్పష్టమవుతోంది. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు కూడా అందుబాటులో ఉండటంతో అందులో చేర్పిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆకర్షణీయమైన ప్రకటనలతో అటువైపు కూడా వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు. హనుమకొండలో 16, వరంగల్‌లో 13 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఏ మేరకు ప్రవేశాలు పొందుతారనేది వేచి చూడాల్సిందే.
అనుకున్నస్థాయిలో నమోదుకాని విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా మంగళవారం వరకు 3,896 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అనుకున్న మేర విద్యార్థుల నమోదు ప్రక్రియ కావడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లాలో ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 568 ఉండగా అందులో అసలు విద్యార్థులే లేని పాఠశాలలు 135 ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలు గు పాఠశాలలే తెరుచుకున్నాయి. అసలే విద్యార్థులు లేని పాఠశాలల టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు.
విద్యార్థుల నమోదు లక్ష్యం నెరవేరేనా!
ప్రభుత్వ స్కూళ్లపై
గురుకులాల ప్రభావం
జిల్లాలో 3,896 మంది
విద్యార్థుల నమోదు