
‘ఆత్మ’ కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు
దుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మరో ముందడుగు వేస్తోంది. ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆత్మ కమిటీలు కొన్ని సంవత్సరాలుగా ఆనవాళ్లు లేకుండా పోయాయి. వీటితో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం పెంచేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం ఆత్మ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వ్యవసాయ డివిజన్‌ను బ్లాక్‌గా పరిగణించి రైతులు, అధికారులతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది. యువజన సంఘాలు, మహిళా మండలి సభ్యులు, ఎరువుల దుకాణాల డీలర్లు తదితరుల భాగస్వామ్యంతో 20 నుంచి 24 మందితో కమిటీ ఏర్పాటు అయ్యేది. కన్వీనర్‌గా ఏడీఏ, మిగిలిన వారు సభ్యులుగా వ్యవహరించేవారు. డివిజన్‌కు ముగ్గురిని తీసుకుని జిల్లా కమిటీ ఏర్పాటు చేసేవారు. రైతులకు ఆధునిక వ్యవసాయంపై సలహాలు, సూచనలు ఇవ్వడం, వ్యవసాయ శిక్షణ శిబిరాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, విజ్ఞాన యాత్రలు నిర్వహింది. 2019 నుంచి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో అప్పటి నుంచి ఆత్మ కమిటీలు కనుమరుగయ్యాయి. ఈసారి ప్రభుత్వం మళ్లీ ఆత్మ కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు పంటల సాగులో సలహాలు సూచనలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో కమిటీలు పూర్తిచేసి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు.
కమిటీల్లో 24 నుంచి 28 మందికి అవకాశం..
మొదట నియోజకవర్గస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిన అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. నియోజకవర్గ, జిల్లాస్థాయి కమిటీల్లో 24 నుంచి 28 మందికి అవకాశం ఉంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు ప్రాధాన్యం కల్పిస్తారు. కమిటీల్లో వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, సెరికల్చర్, విత్తన డీలర్లు, శాస్త్రవేత్తలకు చోటు కల్పిస్తారు. వ్యవసాయ శాఖ అధికారులు కమిటీలపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.
ఆదేశాలు రాగానే
కమిటీలు ఏర్పాటు చేస్తాం..
ఆత్మ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కమిటీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 28 మంది సభ్యులతో మొదట నియోజకవర్గ కమిటీలు, ఆ తర్వాత జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఆదేశాలు రాగానే కమిటీలు ఏర్పాటు చేస్తాం. నూతనంగా ఏర్పాటయ్యే కమిటీలు రైతులకు సాగులో మెళకువలు, సాంకేతిక వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణపై నిరంతరం సలహాలు ఇస్తాయి.
– అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి
ఆత్మ కమిటీల లక్ష్యాలు..
పంటల సాగులో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం.
రైతులకు శిక్షణ, మార్గదర్శకత్వం ఇవ్వడం.
వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం.
రైతుల ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం.
రైతులు, అధికారులు,
శాస్త్రవేత్తలకు అవకాశం
జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు

‘ఆత్మ’ కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు