
వినతులు త్వరగా పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో గ్రీవెన్స్‌లో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు మొత్తం 145 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, సీపీఓ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్ని శాఖల అధికారులు రావాల్సిందే
కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా రావాల్సిందేనని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణికి హాజరైన కలెక్టర్ స్నేహ శబరీష్ పోలీస్, ఫారెస్ట్ శాఖ నుంచి అధికారులు వచ్చారా? అంటూ ప్రత్యేకంగా ఆరా తీశారు. వారు రాలేదని అధికారులు తెలపడంతో హాజరు రిజిస్టర్ ఇవ్వమని సంబంధిత అధికారులు నుంచి తీసుకొని పరిశీలించారు. శాఖల వారీగా ఎవరెవరు వచ్చారు? అని పరిశీలించిన కలెక్టర్ ఇకపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు కూడా ప్రజావాణికి హాజరుకావాలని ఆదేశించారు. అధికారులు సకాలంలో హాజరుకావడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ స్నేహ శబరీష్