
వర్షాకాలం జరభద్రం!
నర్సంపేట: వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. పట్టణం, గ్రామాల్లో అపరిశుభ్రత వాతావరణంతో పలు రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యాధులను అరికట్టాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లా 70 శాతం గ్రామీణ ప్రాంతంగా విస్తరించి ఉండడంతో వర్షాకాలంలో నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలుపుతూ ఇప్పటికే జ్వర సర్వే ప్రారంభించి హైరిస్క్ ప్రాంతాలను కూడా గుర్తించింది. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలతో పాటు మున్సిపాలిటీలో సీజనల్ వ్యాధుల నివారణకు తగు సూచనలు చేస్తుంది.
మొదలైన జ్వర సర్వే...
జిల్లాలో జ్వర సర్వేను వైద్య ఆరోగ్యశాఖ జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు, సూపర్ వైజర్లు ఇంటింటికి తిరుగుతూ నిల్వ నీటిని తొలగించుకోవాలని, లార్వను గుర్తిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నారు. అన్ని రకాల పరీక్షల కిట్లు, మందులు అందుబాటులో ఉంచి కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వైద్య శిబిరాలు, మందులు, నమూనాల సేకరణ, పరిశుభ్రత తదితర అంశాలను పర్యవేక్షిస్తూ జ్వరపీడితులను గుర్తిస్తున్నారు. పట్టణంలోని మురికి నీరు నిల్వ స్థలాలను గుర్తించి ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి ఉండే ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను గుర్తిస్తూ హైరిస్క్ ప్రాంతాలుగా నమోదు చేసుకొని అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
అన్ని జాగ్రత్తలు చేపడుతున్నాం..
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే సర్వేలు నిర్వహిస్తూ ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నాం. నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. ఎక్కడైనా అనారోగ్య సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటే ఆయా ప్రాంతాల్లో ఆస్పత్రుల సిబ్బందికి సమాచారం ఇస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– ప్రకాశ్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
మొదలైన సీజనల్ వ్యాధులు
అప్రమత్తమైన యంత్రాంగం
ముందు జాగ్రత్తలు మేలంటున్న వైద్యులు
జిల్లాలో నమోదైన కేసుల వివరాలు
సంవత్సరం డెంగీ మలేరియా
2023 160 7
2024 321 7
2025 18 5