
పాలనలో తనదైన మార్క్
సాక్షి, వరంగల్: జిల్లాలో ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తూనే.. ప్రాధాన్యం కలిగిన విద్య, వైద్యంతోపాటు ఉమ్మడి వరంగల్ వాసుల ఏళ్లనాటి కల మామునూరు విమానాశ్రయ పనులు ముందుకు తీసుకెళ్లడంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద తన మార్క్ చూపెడుతున్నారు. కలెక్టర్‌గా ఆమె సోమవారం నాటికి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికానుంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు గురుకుల పాఠశాలల్లో ‘ఫిర్యాదుల పెట్టెలు’ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గురుకులాలను సందర్శించిన సమయంలో ఫిర్యాదుల పెట్టెలను తెరిచి విద్యార్థుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు వచ్చాయి. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచారు. అలాగే, గ్రీవెన్స్‌కు వచ్చే సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన ప్రపంచ అందాల భామల పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేశారు. చారిత్రక వరంగల్ ప్రాధాన్యతను ప్రపంచానికి చాటేలా పర్యవేక్షించారు.
ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స..
వరంగల్‌కే కాదు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రికి చికిత్స చేయడంలో కాస్త సఫలమయ్యారు. రోజు వేలాది మంది ఇక్కడికి వైద్య పరీక్షలకు వస్తారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యశారద తొలి రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఎంజీఎంపై దృష్టిసారించారు. డుమ్మాకొట్టే వైద్యులకు అప్పటి సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్ ద్వారా నోటీసులు కూడా ఇప్పించారు. రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే కొందరు నర్సుల తీరు కూడా మార్చుకోవాలని ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్చరించారు. ఇలా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి ఎంజీఎం పాలనలో మార్పు తీసుకొచ్చారు.
నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రిపై ఫోకస్..
రూ.56 కోట్లతో నర్సంపేటలో 220 పడకలతో నిర్మించిన జిల్లా ఆస్పత్రితో పాటు 50 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను గతేడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి తీసుకురావడంలో కలెక్టర్ తనదైన ముద్రవేశారు. అంతకుముందే ఈ నిర్మాణ పనులు జరిగినా.. ఆమె వచ్చాక వారానికోసారి ఈ పనులను సమీక్షించారు. గతేడాది సెప్టెంబర్ 19న అందుబాటులోకి తీసుకురావడంలో అందరూ అధికారులను సమన్వయం చేయడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా నర్సంపేట నియోజకవర్గవాసులకు కార్పొరేట్ తరహా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యానికి పెద్దగా ఇబ్బంది లేకుండా చేశారు.
ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు సర్వే..
ఉమ్మడి వరంగల్ వాసుల ఏళ్లనాటి కల నెరవేర్చే దిశగా కలెక్టర్ అడుగులు వేస్తున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే మామునూరు విమానాశ్రయం కోసం అవసరమయ్యే అదనపు 253 ఎకరాల భూసేకరణ సర్వేను పలు దఫాలుగా రెవెన్యూ అధికారులతో చేయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తే గతేడాది నవంబర్‌లో నష్టపరిహారం కోసం రూ.205 కోట్లు మంజూరుకు అనుమతిచ్చింది. అయితే అక్కడి భూనిర్వాసితులతో మూడు దఫాలుగా సమావేశమైన కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని జిల్లా చర్చల కమిటీ తమకున్న విచక్షణాధికారాలతో ఎకరాకు రూ.1,20 కోట్లు చెల్లిస్తామంది. వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4,887 చెల్లిస్తామని ఇదే ఫైనల్ అని కలెక్టర్ సత్యశారద తేల్చి చెప్పారు. దీంతో కొందరు రైతులు ఇప్పటికే తమ సమ్మతి తెలిపారు. ఇలా భూనిర్వాసితులను ఒప్పించడంలో ఆమె విజయవంతమయ్యారని కలెక్టరేట్ వర్గాలంటున్నాయి. అలాగే, ఇన్నర్ రింగ్‌రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ హైవే భూనిర్వాసితులతో సమీక్షలు చేస్తూ భూసేకరణ కొలిక్కి వచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు.
భూ భారతిపై తనదైన ముద్ర..
కలెక్టర్‌గా రాకముందు సీసీఎల్‌ఏలో పనిచేసిన అనుభవం ఉండడంతో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి సదస్సుల్లో స్వయంగా పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు. రైతులకు ఉన్న సమస్యలపై అక్కడే నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అలాగే, వరంగల్ నగర అభివృద్ధి పనులపై అన్ని విభాగాలతో సమీక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు. వరంగల్ బస్టాండ్‌తో పాటు జిల్లా సమీకృత కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచాలని ఇప్పటికే అధికారులను పలుమార్లు ఆదేశించారు.
ఎంజీఎంలో మెరుగైన వైద్యసేవలకు ప్రత్యేక చొరవ
మామునూరు విమానాశ్రయం
ముందుకెళ్లేలా చర్యలు
ఫిర్యాదుల పెట్టెలతో విద్యార్థుల
సమస్యల పరిష్కారానికి కృషి
కలెక్టర్‌గా డాక్టర్ సత్యశారద
బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది