‘రోటా’తో రోగాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

‘రోటా’తో రోగాలకు చెక్‌

Jun 16 2025 5:03 AM | Updated on Jun 16 2025 5:03 AM

‘రోటా’తో రోగాలకు చెక్‌

‘రోటా’తో రోగాలకు చెక్‌

గీసుకొండ: పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు పలు రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. వాటిలో రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ అనేది చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు రక్షణ కవచంగా ఉంటోంది. ముఖ్యంగా చిన్నారులు నీళ్ల విరేచనాలు, వాంతులు (డయేరియా), జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం లాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వీటిని నిరోధించడం కోసం రైటా వైరస్‌ వ్యాక్సిన్‌ (టీకా) పిల్లలకు వేస్తే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా తీవ్రమైన విరేచనాల కారణంగా చిన్నపిల్లల్లో 37 నుంచి 96 శాతం మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. వ్యాక్సిన్‌ వేయిస్తే వాటికి చెక్‌ పెట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

మూడు డోసులుగా వ్యాక్సిన్‌..

శిశువు పుట్టిన 6,10, 14 వారాలకు ఈ వ్యాక్సిన్‌ను వేస్తారు. 6వ వారం మొదటి, 10వ వారం రెండు, 14వ వారం మూడో డోస్‌ను ఇస్తామని వైద్యులు చెబుతున్నారు. ఇది నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌. వ్యాక్సిన్‌ ప్రతి వాయిల్‌ (సీసా)లో రెండు డోస్‌లు ఉంటాయి. సీసా మూత తీసిన తర్వాత నాలుగు గంటల్లోపు ఈ వ్యాక్సిన్‌ను ఇద్దరు చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ వాయిల్‌లో 4 ఎంఎల్‌ ఉండగా ఇద్దరిలో ఒక్కొక్కరికి 2 ఎంఎల్‌ ఇస్తారు. నీడిల్‌ లేని సిరంజి ద్వారా వ్యాక్సిన్‌ను తీసుకుని చిన్నపిల్లలకు నోటి (ఓరల్‌) ద్వారా ద్రవ రూపంలో ఈ వ్యాక్సిన్‌ను అందిస్తారు. గతంలో ఒక వాయిల్‌లో 2 ఎంఎల్‌గా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండగా ఒక డోస్‌గా వేసేవారు. ప్రస్తుతం 4 ఎంఎల్‌ ఉండే వాయిల్‌ను అందుబాటులోకి తెచ్చా రు. దీంతో ఇద్దరు పిల్లలకు 2 ఎంఎల్‌ చొప్పున వ్యాక్సిన్‌ వేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉండేందుకు..

రోటా వైరస్‌ అనేది అతిసారం, వాంతులను కలిగించే ఇన్‌ఫెక్షన్‌. ఇది పేగు వైరస్‌. చిన్నపిల్లల్లో సులభంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన పిల్లలు చాలా వరకు కొన్ని రోజుల్లోనే కోలుకుంటారని, కొందరికి ఇది ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ముందస్తుగా ఇలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండడానికి రోటా వైరస్‌ టీకా వేయించాలని సూచిస్తున్నారు.

అందుబాటులో వ్యాక్సిన్‌..

జిల్లాలోని ప్రతీ హెల్త్‌ సబ్‌సెంటర్‌లో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచినట్లు డిప్యూడీ డీఐఓ, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ప్రకాశ్‌ తెలిపారు. సబ్‌సెంటర్లలో ప్రతీ బుధ, శనివారాల్లో పిల్లలకు వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. వరంగల్‌ మహాత్మా గాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రితోపాటు జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ప్రతీ రోజు వ్యాక్సిన్‌ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. టీకా వేసే కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు శనివారం ప్రారంభించారు. నగరంలోని దేశాయిపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, గీసుకొండ మండలంలోని కొమ్మాల, సింగ్యతండాల్లో ఆయన వ్యాక్సిన్‌ వేసే కేంద్రాలను పరిశీలించారు. వైద్యుల సలహా మేరకు అర్హులైన పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

టీకాతో వాంతులు, విరేచనాలు,

జ్వరం తదితర వ్యాధుల నివారణ

శిశువు పుట్టిన 6,10,14 వారాల

సమయంలో ఇవ్వాలి

జిల్లాలో చిన్నారులకు

ప్రారంభమైన వ్యాక్సినేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement