‘గ్రేటర్’ గాడిన పడేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్:
బల్దియా కొత్త కమిషనర్ చౌహత్ బాజ్‌పాయ్‌కి నగరంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కలెక్టరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న జీడబ్ల్యూఎంసీ, కుడా ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా... క్షేత్రస్థాయిలో కొన్ని విభాగాల్లో కోరలు చాస్తున్న అవినీతి, అక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తోంది. పార్కులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు నగరంలో విచ్చలవిడిగా సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. భవన నిర్మాణదారుల సంఘం ఏకంగా సీఎం పేషీలోనే ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్‌కు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని ఒప్పించి కాంట్రాక్టర్ల సిండికేట్‌కు ఎక్సెస్ టెండర్‌పై పనులు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చక్రం తిప్పుతుండడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌తోపాటు కుడా వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్‌పాయ్ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పాలన గాడిన పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఎక్కడికెళ్లినా తిరిగి ఇక్కడికే...
జీడబ్ల్యూఎంసీలో పని చేయడానికి అలవాటు పడిన అధికారులు ఎక్కడికి వెళ్లినా కొద్దిరోజులే. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మళ్లీ బల్దియాకే వస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీలో ఓ విభాగానికి కీలకాధికారిగా ఉన్న ఒకరు అతడి పదవికి ముప్పు వస్తుందంటే చాలు.. పాదరసంలా పావులు కదుపుతారు. ఈ టాలెంట్‌తోనే 22 నెలల కిందటి వరకు ఏడాదికోసారి రెన్యువల్ చేయించుకుని నాలుగేళ్లు గడిపిన ఆయన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొద్ది రోజులు పనిచేశారు. పదోన్నతిపై ఆయన తిరిగి 2024 అక్టోబర్ చివరి వారంలో ‘రాజా’లాగా బల్దియాలోని కీలకపోస్టులో చేరారు. ఆయన ఉన్న సమయంలోనే బల్దియా నిధుల దుర్వినియోగంతోపాటు పెద్ద సంఖ్యలో జరిగిన ఔట్ సోర్సింగ్ కార్మికుల నియామకాల్లో రూ.లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏసీబీ, స్పెషల్ బ్రాంచ్‌లు విచారణ చేపట్టాయి.
● జూనియర్ అసిస్టెంట్‌గా చేరి ట్యాక్స్ ఆఫీసర్‌స్థాయి వరకు ఎదిగిన మరో అధికారి సైతం ‘బల్దియా’ను వదల అన్నారు. ప్రమోషన్‌కు ముందు.. తర్వాత కొద్ది మాసాలు మాత్రమే ఇతర మున్సిపాలిటీలకు వెళ్తూ వెంటనే జీడబ్ల్యూఎంసీకి రావడం ఇతడికి పరిపాటి. ఎన్నికల నిబంధనల మేరకు ట్యాక్స్ ఆఫీసర్‌గా వర్ధన్నపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఇటీవల మళ్లీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కీలక పదవిలో చేరారు.
● పీహెచ్‌సీ వర్కర్ నుంచి టీఓ వరకు ఎదిగిన ఒకరు ‘గ్రేటర్’ను వదలడం లేదు. హెల్త్‌అసిస్టెంట్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా ఇక్కడే పనిచేసి.. కమిషనర్ పదోన్నతిపై భూపాలపల్లి, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో కొద్ది రోజులు మాత్రమే పనిచేసిన సదరు అధికారి పన్నుల విభాగం కీలక అధికారిగా చేరారు.
● ఇంజనీరింగ్ విభాగంలో చిన్న ఉద్యోగిగా విధుల్లో చేరిన ఒకరు ఓ ఉన్నతస్థాయి అధికారిగా ఎదిగి ఇక్కడే ఉద్యోగ విరమణ చేశారు.
● ‘కుడా’లో డిప్యూటీ ఈఈ నుంచి ఎస్‌ఈ వరకు ఇక్కడి పనిచేస్తున్న ఓ అధికారి వరంగల్‌ను వదలడం లేదు. ఇలా చాలామంది ఉన్నారు.
కొత్త కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కొరడా ఝుళిపించేనా..
జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’లో ఇష్టారాజ్యం.. పలు విభాగాలపై అవినీతి ఆరోపణలు
ప్రతి పనికి రేట్ ఫిక్స్ చేసి వసూళ్లు..
అభివృద్ధి ఉన్నా అవినీతితో చెడ్డపేరు
బల్దియాలో ఏళ్ల తరబడిగా అధికారుల తిష్ట.. ఎక్కడికి బదిలీ చేసినా
పదోన్నతులపై ఇక్కడికే..
అవినీతి ఆరోపణల్లో పలు విభాగాలు..
ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర శాఖలపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. వరంగల్ నగరం చుట్టూ విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాన్ లేఅవుట్ ప్లాట్లను ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో గొలుసుకట్లు చెరువులు, జీడబ్ల్యూఎంసీ స్థలాలు, కీలకమైన నాలాలను ఆక్రమించి వెంచర్ల వేయడంతో పాటు ఇండ్లు నిర్మించుకున్న వారికి అనుమతులు ఇచ్చి పెద్దమొత్తంలో వసూలు చేశారన్న ఫిర్యాదులపై ‘విజిలెన్స్’ విచారణకు ఆదేశించారు. ఆరు నెలల వ్యవధిలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహించిన సుమారు రూ.314 కోట్ల ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్లలోనూ కాంట్రాక్టర్లను మిలాఖత్ చేసి 4.99 శాతం ఎక్సెస్ టెండర్ పనులు దక్కేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పెద్దమొత్తంలో అందరూ కలిసి వాటాలు పంచుకున్నారన్న ప్రచారం ఉంది.


