ఇప్పుడేం చేద్దాం?
పీఏసీఎస్‌లకు పర్సన్
ఇన్‌చార్జ్‌ల నియామకం
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది.
2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్‌ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్‌లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి.
పర్సన్ ఇన్‌చార్జ్‌ల పాలనా?
త్వరలో ఎన్నికలా?
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్‌చార్జ్ లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్‌కు అప్పగించగా, పీఏసీఎస్ లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్‌చార్జ్‌లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది.
వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్‌గా
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్‌చార్జ్‌గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను ప్రభుత్వం నియమించగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లాలోని 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సీనియర్ ఇన్‌స్పెక్టర్లను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. పరకాల, కమలాపూర్ పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జ్‌గా ఎన్.శ్రీనివాస్‌రావును నియమించారు. పెగడపల్లి ఎ.కృష్ణవేణి, నందనం ఎస్.సదీప్‌కుమార్, ధర్మసాగర్, సింగారం కె.రవీంద్ర, హసన్‌పర్తికి ఎ.జగన్‌మోహన్‌రావు, దర్గా కాజీపేట, మల్లారెడ్డిపల్లి ఎం.సునీల్ కుమార్, పెంచికలపేట, శాయంపేటకు రాధిక, ఎల్కతుర్తి సీని యర్ ఇన్‌స్పెక్టర్ ఎండీ అఫ్జలుద్దీన్, మాదారం సీనియర్ ఇన్‌స్పెక్టర్ వి.జ్యోతి, పెద్దాపూర్‌కు సీనియర్ ఇన్‌స్పెక్టర్ మతీన్‌సుల్తాన్, వంగపహాడ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ జె.సత్యానందం, ఆత్మకూరు సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎం.రాణిశ్రీలక్ష్మిని పర్సన్‌ఇన్‌చార్జ్‌గా నియమించారు.
సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం
వైదొలిగిన 99 పీఏసీఎస్‌లు
పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం
మరోసారి పొడిగింపుపై ఆశలు..
రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం
సహకార సంఘాల ఎన్నికలు
జరుగుతాయని ప్రచారం
అన్ని పార్టీల్లో ఎలక్షన్స్‌పై మళ్లీ
మొదలైన చర్చ
2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌లు
మొత్తం సహకార సంఘాలు: 99 డైరెక్టర్ స్థానాలు: 1,260 ఏకగ్రీవంగా ఎన్నికై నవి: 509 ఎన్నికలు జరిగినవి: 751


