ఆపదలో ఆదెరువు! | - | Sakshi
Sakshi News home page

ఆపదలో ఆదెరువు!

Dec 21 2025 6:58 AM | Updated on Dec 21 2025 6:58 AM

ఆపదలో

ఆపదలో ఆదెరువు!

వడ్డేపల్లి చెరువులో చేరుతున్న మురుగునీరు

కాజీపేట: కాజీపేట, హనుమకొండ పట్టణవాసులకు ఒకప్పుడు తాగు నీరందించిన వడ్డేపల్లి రిజర్వాయర్‌ ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయింది. కాకతీయ రాజుల కాలంలో ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు వడ్డేపల్లి చెరువును తవ్వించారు. ఈ చెరువు ద్వారా దాదాపు 600 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. దాన్ని 1993లో పూర్తిగా సమ్మర్‌ స్టోరేజీగా అభివృద్ధి చేశారు. అనంతర కాలంలో నగర పాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా కాజీపేట పట్టణ మురుగు నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరి నీరు కలుషితమవుతూ వస్తోంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తరహాలో ఈ రిజర్వాయర్‌లో శవాలు తేలుతున్న ఘటనలు కూడా నగరవాసులను ఆందోళన కలిగిస్తున్నాయి.

డ్రెయినేజీలన్నీ వడ్డేపల్లి చెరువు వైపే..

కాజీపేట పట్టణ పరిధి ఆయా డివిజన్లలో నిర్మించిన డ్రెయినేజీల నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరుతోంది. సోమిడి ఊరచెరువు తూము నుంచి మురికి కాల్వల ద్వారా కలుషిత నీరు వడ్డేపల్లి చెరువులో చేరుతోంది. ఊర చెరువును ఆక్రమించుకుని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన రియల్‌ వ్యాపారులు తూముకు గండి కొట్టడమే ఈ చెరువు నీరు కలుషితమవడానికి ఒక కారణం. గతంలో వడ్డేపల్లి ఫోర్‌షోర్‌ బండ్‌కు ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్‌ అవతలి వైపున మురుగు నీరు చెరువులోకి వెళ్లకుండా కట్ట మాదిరిగా రాళ్లతో నిర్మాణాలు చేపట్టారు. అయితే రాళ్ల పక్క నుంచి మురుగు నీరు సవ్యంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ నీరంతా కట్ట మీది నుంచి చెరువులోకి ప్రవేశిస్తోంది.

అనుమతి పొందడంలో జాప్యం..

మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా నివారించాలంటే.. రైల్వే ట్రాక్‌ కింది నుంచి మోరీ నిర్మించాల్సి ఉంది. ఈ మోరీ నిర్మాణానికి రైల్వే అనుమతి తప్పనిసరి. ఇందుకోసం మున్సిపల్‌ అధికారులు రైల్వేశాఖకు పలుమార్లు లేఖలు రాసినా అనుమతులు రాకపోవడంతో మిన్నకుండిపోయారు. దీంతో లక్షల రూపాయలతో సోమిడి వైపు నిర్మించిన కట్ట వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు పేర్కొంటున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

కాజీపేట 61వ డివిజన్‌లోని సిద్ధార్థనగర్‌ వైపు నుంచి మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా, వడ్డేపల్లి చెరువులోని నీరు సిద్ధార్థనగర్‌లోకి ప్రవేశించకుండా ఉండడానికి ఫోర్‌షోర్‌ బండ్‌ను నిర్మించారు. ఈ బండ్‌ నిర్మాణం జరిగినపుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ బండ్‌ కోతకు గుౖరవుతుంది. చెరువు నీటి తాకిడికి ఈ బండ్‌ ఎప్పుడు గండిపడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ ఫోర్‌షోర్‌ బండ్‌కు ఇరువైపులా పెద్ద ఎత్తున తుమ్మచెట్లు పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌గా మారింది. మలమూత్రాల విసర్జన చెరువు పరిసరాలను వాడుతున్నారు. కాగా, చెరువు కింద ఉన్న కాలనీల్లోని బోరు బావుల్లో నీరు నల్లగా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, వడ్డేపల్లి చెరువు నీరు కలుషితంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఓ మున్సిపల్‌ ఉన్నతాధికారిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. ‘బల్లార్షా రైల్వే లైన్‌ కింద నుంచి సైడ్‌ కాల్వ నిర్మించడానికి ప్రత్యేక అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. పర్మిషన్‌ రాగానే పనులు ప్రారంభించి చెరువు కలుషితం అవ్వకుండా చూస్తాం’ అని చెప్పారు.

కలుషితం కాకుండా చూడాలి..

వడ్డేపల్లి చెరువు పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. తక్షణమే రిజర్వాయర్‌ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాలి. అవసరమైతే ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించి తాగునీరు కలుషితం అవ్వకుండా చూడాలి.

– మర్యాల కృష్ణ, కాజీపేట

కాల్వలను మళ్లించాలి..

వడ్డేపల్లి రిజర్వాయర్‌లోకి నేరుగా ఉన్న మురికి కాలువలను అధికారులు గుర్తించి దారి మళ్లించడానికి ఉన్న అవకాశాలపై ప్రత్యేక సర్వే చేయాలి. చెరువులోకి పలు ప్రాంతాల నుంచి వస్తున్న మురికినీరు వల్ల తాగునీరు కలుషితమవుతోంది. దీని నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.

– ఎండీ సోనీ, కాజీపేట

కోతకు గురవుతున్న ఫోర్‌షోర్‌ బండ్‌

రిజర్వాయర్‌లో తేలుతున్న శవాలు

కన్నెత్తి చూడని అధికారులు

ఆందోళనలో నగరవాసులు

ఆపదలో ఆదెరువు!1
1/3

ఆపదలో ఆదెరువు!

ఆపదలో ఆదెరువు!2
2/3

ఆపదలో ఆదెరువు!

ఆపదలో ఆదెరువు!3
3/3

ఆపదలో ఆదెరువు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement