ఐనవోలు జాతరకు ఏర్పాట్లు చేయాలి
సమీక్షలో మంత్రి కొండా సురేఖ
హన్మకొండ అర్బన్: ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జనవరి 13 తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రవాణా, పార్కింగ్‌కు ఏర్పాట్లు
ఐనవోలు నుంచి కొమురవెల్లి, మేడారానికి వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వీఐపీ దర్శనానికి టోకెన్ల విధానం అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. అనంతరం పర్యాటక శాఖ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమీక్షలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కొత్తకొండ జాతరపై సమీక్ష
భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జనవరి 9 నుంచి 18 వరకు జరిగే శ్రీ వీరభద్రస్వామి జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మధుసూదన్, ఆలయ ఈఓ కిషన్‌న్‌రావు, డాక్టర్ అప్పయ్య, ఆర్టీసీ డీఎం అర్పిత, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం తదితరులు పాల్గొన్నారు.


