యాసంగి ప్రణాళిక ఖరారు
హన్మకొండ: జిల్లాలో యాసంగి ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసి, చెరువులు, కుంటల్లో నీరు చేరింది. భూగర్భ జలాలు పెరిగాయి. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. గత యాసంగిలో వరి 1,32,280 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1,29,500 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత యాసంగిలో మొక్కజొన్న 63,608 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 64,100, వేరుశనగ గత యాసంగిలో 473 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 370ఎకరాల్లో సాగుచేయనున్నారు. పప్పుదినుసులు గత యాసంగిలో 238 ఎకరాల్లో సాగు చేయగా ఈ యాసంగిలో 240 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. యూరియా 28,584 మెట్రిక్ టన్నులు, డీఏపీ 10,587, ఎన్‌పీకే 26,466, ఎంఓపీ 8,469 మెట్రిక్ టన్నుల అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు ఎరువులు సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది యాసంగిలో సాగైన విస్తీర్ణంతో పోలిస్తే వ్యవసాయ శాఖ విస్తీర్ణాన్ని తగ్గించింది. గతేడాది యాసంగిలో అన్ని పంటలు కలిపి 1,97,025 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత యాసంగితో చూస్తే 2,815 ఎకరాలు తగ్గింది. పరిస్థితులు చూస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వానాకాలంలో అన్ని పంటలు కలిపి 2,27,951 ఎకరాలు సాగు చేశారు. వానాకాలంలో చూస్తే 33,741 ఎకరాలు తగ్గింది. వానాకాలంలో పత్తితో పాటు ఇతర మెట్ట పంటలు సాగు చేయడంతో విస్తీర్ణం పెరిగింది.
జిల్లాలో 1,94,210
ఎకరాల్లో పంటల సాగు
యూరియా అవసరం
28,584 మెట్రిక్ టన్నులు
డీఏపీ 10,587 మెట్రిక్ టన్నులు,
ఎన్‌పీకే 26,466 మెట్రిక్ టన్నులు


