గడువుదీరిన పురుగు మందులు స్వాధీనం
పరకాల : వ్యవసాయ పనులు మొదలవడమే ఆలస్యం.. నాసిరకం విత్తనాలు, ఎరువులు, గడువుతీరిన పురుగుల మందులు విక్రయిస్తూ రైతులను మోసం చేయడానికి కొందరు వ్యాపారస్తులు సిద్ధమవుతున్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల జారీచేయడంతో పరకాల ఏసీపీ సతీష్‌కుమార్ పర్యవేక్షణలో విత్తనాలు, ఎరువులు దుకాణాల్లో దాడులు చేస్తున్నారు. దీంతో కొందరు వ్యాపారస్తులు గ్రామాల్లో ఉండే దుకాణాలను అడ్డాగా మార్చుతున్నారు. మండలంలోని నాగారం గ్రామంలో గల శ్రీరాజరాజేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దుకాణంతోపాటు యజమాని ఇంట్లో తనిఖీ చేయగా రూ.2.49లక్షల విలువైన కాలం చెల్లిన షీన్వా, ఎక్స్‌పోనస్, ఎలక్టో, ఓబెన్ కంపెనీకి చెందిన పురుగు మందులు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని యజమాని ఎం.తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు.
పోలీసుల అదుపులో మరికొందరు..
పోలీసుల నిరంతర దాడులతో పరకాల పట్టణానికి చెందిన కొందరు కాలం చెల్లిన పురుగు మందులను, అనుమతి లేని ప్రాంతాల్లో నిల్వచేసి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. పురుగు మందులు స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విక్రయాల వెనక పరకాల పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తుల పాత్ర ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
నాగారంలోని ఓ దుకాణంపై పోలీసుల దాడి
రూ.2.49లక్షల విలువైన పెస్టిసైడ్స్ పట్టివేత
విచారణ చేపట్టిన పరకాల పోలీసులు


