
భూ సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
న్యూశాయంపేట: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమైందని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాలలో లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సెటిల్‌మెంట్ భూ రికా ర్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజు భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్‌లను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 315 మంది సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజులపాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే సర్వేయర్లుగా నియమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అభ్యర్థులకు శిక్షణ మెటిరియల్ కిట్‌ను అందించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ల్యాండ్ సర్వే అధికారి దేవరాజు, డీఐ నాగభూషణం, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు.
కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలకం
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కలెక్టర్లు పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ నుంచి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
హాస్టళ్లలో వసతులు కల్పించాలి
జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెడియల్ స్కూల్స్‌లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆర్సీఓలను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై ఆర్సీఓలు, ప్రిన్సిపాల్స్‌తో మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సురక్షితంగా, ఆరోగ్యంగా, గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. జూన్ 12న పాఠశాలల ప్రారంభోత్సవానికి ముందే యూనిఫాం సిద్ధంగా ఉండాలన్నారు. హాస్టల్‌లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని వారి అవసరాలను గుర్తించాలన్నారు. హాస్టల్స్‌లో కంప్లైంట్స్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
విత్తన కంపెనీ గోదాం పరిశీలన
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని రాసి సీడ్స్ కంపెనీ గోదాంను మంగళవారం కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. గోదాం స్టోరేజి పాయింట్ నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించా రు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ఎస్సీ వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య, మైనార్టీ వెల్ఫేర్ అధికారి రమేష్, ల్యాండ్ సర్వే అధికారి దేవరాజు, డీఐ నాగభూషణం, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏ దామోదర్, ఏఓ హరిప్రసాద్‌బాబు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద