
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
నర్సంపేట/సంగెం/నెక్కొండ: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నారావుపేట మండల కేంద్రం, మగ్ధుంపురం, పాపయ్యపేట, సంగెం మండలం కాపులకనిపర్తి, నెక్కొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉండాలని, కొనుగోళ్లను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించి వివరాలను ట్యాబ్‌ల్లో నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను వెంటనే ఖాళీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని రైస్ మిల్లులను తనిఖీ చేసిన కలెక్టర్.. మిల్లులోని రికార్డులు, ధాన్యం తేమ యంత్రాలు, బియ్యం పరిశీలించారు. ధాన్యం వివరాలు, మిల్లు కెపాసిటీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార శాఖ అధికారి నీరజ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, నర్సంపేట, సంగెం, నెక్కొండ తహసీల్దార్లు ఫణికుమార్, రాజ్‌కుమార్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద