
రాంపురంలో కుంట కట్ట ధ్వంసం
గీసుకొండ: మండలంలోని రాంపురం రామయ్యకుంట కట్టను కొందరు శనివారం ధ్వంసం చేసి అమ్ముకోవడానికి చేసిన ప్రయత్నం వివాదానికి దారితీసింది. కట్టతోపాటు చెట్లను తొలగించి చదును చేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన బండారు నరేందర్, శ్రీనివాస్ కుంట కట్ట భూమిని చదును చేసి అమ్ముకుందామనే ప్రయత్నాలు చేయడంతో రైతులు తహసీల్దార్ రియాజుద్దీన్, ఐబీ ఏఈ విజయలక్ష్మికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆకట్ట పైనుంచి తాము పంటచేలకు వెళ్లే దారి ఉందని, అలాగే కట్టను తొలగిస్తే కింది భూములు ముంపునకు గురవుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 750 సంవత్సరాల నుంచి ఉన్న కుంట కట్టను ఎలాంటి హక్కులు లేని వారు తొలగించారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించిన తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్ మాట్లాడుతూ కుంట కట్టను తొలగించడం చట్ట ప్రకారం నేరమన్నారు. కట్టను తొలగించిన వారిపై ఐబీ ఏఈ.. గీసుకొండ సీఐ మహేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విలేకరులు సీఐని వివరణ కోరగా విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతు రడం భరత్ మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నుంచి ఉన్న కుంట కట్టను తొలగించడం సరికాదని, కట్టను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయకట్టు రైతులు
తహసీల్దార్, ఏఈ, సీఐకి ఫిర్యాదు