
ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
న్యూశాయంపేట: ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లలో చేపట్టాలని జిల్లా అధికారులకు మంత్రులు సూచించారు. ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్.చౌహాన్‌లతో కలిసి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ మహాయజ్ఞంలా చేపట్టినట్లు తెలిపారు. ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. సన్నబియ్యం పంపిణీపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 182 ధాన్యం కొనుగొలు కేంద్రాల్లో రెండు లక్షల మెట్రిక్‌టన్నుల వరిధాన్యం సేకరణ అంచనా వేయగా ఇప్పటి వరకు దాదాపు 87వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీసీలో డీసీఓ నీరజ, డీఏఓ అనురాధ, డీఆర్డీఓ కౌసల్యాదేవి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీఎస్‌ఓ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్, తుమ్మల