
నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య
కరీమాబాద్: నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిన బారికేడ్లు, పోలీసు బందోబస్తు, మీడియా పా యింట్ తదితర అంశాలపై మంగళవారం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ బారి, ట్రెయినీ ఐపీఎస్ శుభంనాగ్, డీఆర్వో శ్రీనివాస్‌తో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాలు, వీడియో ద్వారా చిత్రీకరించాలని, అభ్యర్థి ఆర్వో గదిలోకి ప్రవేశించగానే కనిపించేలా గడియారం ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ కమి షనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి వంద మీటర్ల వరకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. డీపీఆర్వో అయూబ్ అలీ, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, పర్యవేక్షకుడు విశ్వనారాయణ, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి
నామినేషన్ల ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు రూ.12,500, సాధారణ అభ్యర్థులు రూ.25,000 డిపాజిట్ చేయాలని, అభ్యర్థుల ఖర్చు రూ.95 లక్షలకు మించొద్దని స్పష్టం చేశారు. ఈక్రమంలోనే 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్ వేయడానికి ముందే పోటీ చేసే అభ్యర్థి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో కొత్తగా ఖాతా తెలరవాలని సూచించారు. అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. డీఆర్వో శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, రాజ్‌కుమార్, విశ్వనారాయణతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఈవీ శ్రీనివాస్, నిహాల్, అమరేందర్, హరిశంకర్, నిశాంత్, నాగరాజు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పార్లమెంట్
ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య