అకాల వర్షం..అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం..అపార నష్టం

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

ధాన్యం బురదమయం....

10 రోజులుగా మార్కెట్‌యార్డులో వరి ధాన్యం ఆరబోస్తున్నా.. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కళ్లెదుటే వర్షానికి కొట్టుకుపోయి బురదమయమైంది. ఒక్కసారిగా వచ్చిన వర్షం మాకు కన్నీరే మిగిల్చింది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసి న్యాయం చేయాలి.

– హన్మంతు, రైతు, మూలమళ్ల

పది రోజులుగా పడిగాపులు..

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి పది రోజులు అవుతోంది. తాలు, తేమశాతం ఎక్కువగా ఉందంటూ కాలయాపన చేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన వర్షానికి కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుంటే ఆపలేకపోయాం. టార్పాలిన్లు కూడా లేవు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టా.. ఇప్పుడు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.

– ఆంజనేయులు, రైతు,

రామన్‌పాడు, మదనాపురం

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

అకాల వర్షానికి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కొద్దిమేర ధాన్యం తడిసింది. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం. బాయిల్డ్‌ మిల్లులకు కేటాయించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, డీఎం,

పౌరసరఫరాల సంస్థ

వనపర్తి/ఆత్మకూర్‌/మదనాపురం/కొత్తకోట/ గోపాల్‌పేట: అన్నదాతలపై వరణుడు కన్నెర్రజేశాడు. జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్‌, గోపాల్‌పేట, రేవల్లి, మదనాపురం శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న రైతులు ధాన్యం రాశులపై కవర్లు, టార్పాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. వనపర్తి మండలం చిట్యాల శివారులోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సీసీ యార్డుపై వర్షపు నీరు భారీగా పారడంతో విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షపు నీటితో పాటు డ్రైనేజీలో చేరింది. రైతులు నీటిలో కొట్టుకుపోకుండా ధాన్యం ఆపే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. అలాగే మండలంలోని అచ్యుతాపురం, రాజాపేట, నాగవరం, ఉమ్మడి గోపాల్‌పేట మండలంలోని చెన్నారం, ఎదుట్ల, బుద్దారం, ఆత్మకూర్‌, మదనాపురం మార్కెట్‌యార్డుతో పాటు మండలంలోని అజ్జకొల్లు, రామన్‌పాడు, కొత్తకోటలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం తగ్గించుకునేందుకు ఆరబెట్టిన ధాన్యంతో పాటు ఎండిన ధాన్యం కూడా చాలా వరకు తడిసింది. టార్పాలిన్లు కప్పేందుకు వర్షంలోనే ప్రయత్నించినా.. ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. కేంద్రాల్లో తూకం పూర్తయి తరలింపునకు ఉన్న ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయకపోవడం, సేకరించిన ధాన్యం కూడా సకాలంలో తరలించకపోవడంతో కష్టాలు తప్పడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 వేల బస్తాల వరకు అకాల వర్షానికి తడిసి ఉంటుందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అఽధికారుల ప్రాథమిక అంచనా.

కొత్తకోట శివారులో రహదారిపై తడిసిన వరి ధాన్యం కుప్ప

ఆత్మకూర్‌ మండలం మూలమళ్లలో రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న ప్రయాణికులు

రూ.లక్షల్లో నష్టం..

తోటలో మామిడి కాయ లు కోతకు వచ్చాయి. రెండ్రోజుల్లో తెంచాల్సి ఉండగా గాలివానకు రాలిపోయాయి. నాలుగు టన్నులకుపైగానే కాయలు రాలిపోయాయి. దీంతో రూ.లక్షల్లో నష్టం వచ్చింది. – కావలి భాగ్యలక్ష్మి,

మామిడి రైతు, ఆరేపల్లి

రాలిన మామిడి..

అకాల వర్షానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి ఈదురు గాలులకు కాయలు రాలిపోయాయి. ఆత్మకూర్‌ మండలంలోని ఆరేపల్లి, గుంటిపల్లి, తూంపల్లి, వీరరాఘవపూర్‌ తదితర గ్రామాల్లో ఉన్న తోటల్లో కాయలు కోతకు రాగా గాలికి రాలిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు చెట్లు విరిగి విద్యుత్‌ తీగలపై పడటంతో స్తంభాలు కూలి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి వినియోగదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలి

12 రోజులుగా మార్కెట్‌యార్డులో ధాన్యం ఆరబోస్తున్నా. సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయకపోవడంతో వర్షానికి తడసింది. మళ్లీ ఆరడానికి రెండ్రోజులు పడుతుంది. మా బాధలు తీర్చేవారే కరువయ్యారు.

– మధు, రైతు, ఆత్మకూర్‌

నిలిచిన విద్యుత్‌ సరఫరా..

అమరచింత – ఆత్మకూర్‌ మధ్యలో చెట్లు కూలి విద్యుత్‌ తీగలపై పడటంతో సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్‌ గాంధీచౌక్‌లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. డ్రైనేజీ వద్ద కల్వర్టు నిర్మించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు ట్రాన్స్‌కో అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement