పెట్రోల్‌ మంట.. డీజిల్‌ సెగ | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ మంట.. డీజిల్‌ సెగ

May 16 2026 12:45 AM | Updated on May 16 2026 12:45 AM

వాహనదారుల జేబుకు చిల్లు

పాలమూరులో పెట్రోల్‌పై రూ.3.39, డీజిల్‌పై 3.26 పెంపు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ రూ.3కోట్ల అదనపు భారం

పాలమూరు: అనుకున్నట్లే.. సామాన్యుడిపై పెట్రో, డీజిల్‌ బాంబు పడింది. పశ్చిమాసియాలో కొనసాగతోన్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడు చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చముర కొరత వల్ల పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం వనపర్తిలో పెట్రోల్‌ లీటర్‌ రూ.108.41 ఉండగా.. ప్రస్తుతం రూ.111.80కి పెరిగింది. డీజిల్‌ రూ.96.59లు ఉండగా... ప్రస్తుతం రూ.99.85కి పెరిగింది. ఈ లెక్క ప్రకారం పెట్రోల్‌ రూ.3.39, డీజిల్‌ 3.26 చొప్పున పెరిగాయి. ధరల పెంపు సామాన్యుడిపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు సగటున 15 లక్షల లీటర్ల పెట్రోల్‌, 70 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. 44వ నంబర్‌జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. పెరిగిన ధరలతో ప్రతిరోజూ వాహనదారులపై దాదాపు రూ.3 కోట్ల వరకు అదనపు భారం పడనుంది.

సామాన్యుడికి గుదిబండ..

నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగే ప్రయత్నం చేయకుండా.. దేశ సంపద ఇతర దేశాలకు పంచుతూ సంక్షోభంలోకి నెట్టేస్తుంది. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంచి సామాన్యులపై మరింత ఆర్థిక భారం మోపుతోంది. బీజేపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేసి సామాన్య ప్రజల సంక్షేమ కోసం ఒక్క పని కూడా చేయట్లేదు.

– శివసేనారెడ్డి, శాట్‌ చైర్మన్‌

ప్రజలపై భారం సరికాదు..

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది. ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను సాకుగా చూపి ఇంధన ధరలు పెంచడం సమంజసం కాదు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలి. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధరలు తగ్గించే వరకు ప్రజల మద్దతుతో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తాం. – వాకిటి శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి

Advertisement
 
Advertisement
Advertisement