వీపనగండ్ల: గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కల్వరాలలో ఆయన పర్యటించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. అలాగే రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కలకు నీరు పోశారు. అనంతరం ఉపాధి ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి కూలీల సంఖ్య పెంపనకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆయన వెంట డీఆర్డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏపీఎం అక్తర్ ఉన్నీసాబేగం, పలువురు అధికారులు ఉన్నారు.
ఎన్యూమరేటర్లకు సహకరించాలి :
అదనపు కలెక్టర్
వనపర్తి: జనగణన–2027లో భాగంగా మే 11 నుంచి జిల్లాలో ఇళ్లగణన ప్రారంభమైందని.. ఇందుకోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిగా సహకరించి కచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ గణనలో ఇంటి పరిస్థితి, ఇంటి నిర్మాణ స్వభావం, గదుల సంఖ్య, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, వంట ఇంధనం (గ్యాస్ సిలిండర్, కట్టెలు, విద్యుత్), వాహనాలు, ఇంటర్నెట్ సదుపాయం వంటి వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ తదితర గృహోపకరణాల వివరాలను కూడా నమోదు చేస్తారన్నారు. అధికారులు అడిగే 33 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని.. ఎన్యూమరేటర్లకు ప్రభుత్వ అధికారిక గుర్తింపుకార్డు ఉంటుందని తెలిపారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందన్నారు.


