విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

వనపర్తి: భవిష్యత్‌లో ఎలాంటి విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని.. అందుకు అన్ని శాఖలు ప్రాథమిక కసరత్తు పక్కాగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ అధికారులను ఆదేశించారు. పర్యావరణ విపత్తులు ఏ విధంగా ఎదుర్కోవాలి.. ఎలా సన్నద్ధం కావాలనే అంశాలపై కేంద్ర, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు టేబుల్‌ ప్రాక్టీస్‌, మాక్‌డ్రిల్‌తో ముందస్తు శిక్షణనిస్తుంది. ఇందులో భాగంగా గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ రాజేష్‌ మీనాతో కలిసి ఆయన జిల్లా అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. అకస్మాత్తుగా వచ్చే పర్యావరణ విపత్తులను జిల్లా యంత్రాంగం ఏ విధంగా ఎదుర్కొంటుందనే అంశంపై అన్ని శాఖలు తమ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని శుక్రవారం కలెక్టరేట్‌కు రావాలని ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తమ కార్యాచరణను టేబుల్‌వర్క్‌ ద్వారా విశదీకరించాలని.. 18వ తేదీన మాక్‌డ్రిల్‌ ద్వారా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మాక్‌డ్రిల్‌కు జిల్లాలో 7 ప్రాంతాలను గుర్తించామని.. ఆయా శాఖల సిబ్బంది స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ఎలా అమలు చేస్తారో ప్రదర్శించాలని కోరారు. మాక్‌డ్రిల్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యావరణ విపత్తుల విభాగాల అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారన్నారు.

అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలు, పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదాలు, అడవుల్లో మంటలు చెలరేగడం, రోడ్డు, రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం ఏ విధంగా వ్యవహరించాలి.. ప్రాణనష్టం జరగకుండా క్షతగాత్రులను ఏ విధంగా రక్షించాలి.. అందుకు కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఎలా వినియోగించుకోవాలనే విషయాలపై ముందస్తు ప్రణాళిక ఉండాలని, అప్పుడే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చన్నారు. మాక్‌డ్రిల్‌తో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. మాక్‌డ్రిల్‌ అనేది నిజంగా విపత్తు వచ్చినట్లు, దానిని నివారించేందుకు సిబ్బంది చేసే కృషి కళ్లకు కట్టినట్టు ఉండాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ రామకృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి బి.ధర్మ, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌, డీఎస్పీ గిరిబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement