ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

ఖిల్లాఘనపురం: ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచేందుకు మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జెడ్పీ సీఈఓ యాదయ్య అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధి పనుల నిర్వహణ, కూలీల సంఖ్య పెంపు, పనులు చేస్తున్న ప్రాంతంలో ఏర్పాట్లు తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచడం తక్షణ కర్తవ్యమన్నారు. అలాగే వారికి గ్రామస్థాయిలో కల్పిస్తున్న పనులను ఎప్పటికప్పుడు గుర్తించాలని.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. మండలస్థాయి అధికారులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ వారికి సూచనలు, సలహాలు ఇవ్వాలని, పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కల పెంపకం, నాటే ప్రాంతాలు గుర్తించాలని చెప్పారు. మరుగుదొడ్లు, సీఎస్‌సీల పురోగతిని పరిశీలించారు. ఎన్‌ఎఫ్‌బీఎస్‌ పథకం ద్వారా 2017, ఏప్రిల్‌ 13 తర్వాత మృతిచెందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తుందని.. ఎవరైనా ఉంటే మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఎంపీఓ నర్సింహులు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement