పుర ప్రక్షాళన జరిగేనా? | - | Sakshi
Sakshi News home page

పుర ప్రక్షాళన జరిగేనా?

Apr 5 2026 7:30 AM | Updated on Apr 5 2026 7:30 AM

ఎమ్మెల్యే సంధిస్తున్న ప్రశ్నలివే..

అధికారుల కసరత్తు..

పారదర్శక పాలనకే..

ఆరోపణలకు చెక్‌ పెట్టేందుకు

ఎమ్మెల్యే వ్యూహాత్మక అడుగులు

అధికార యంత్రాంగంలో వణుకు

వనపర్తిటౌన్‌: నియోజకవర్గంలోని వనపర్తి, పెబ్బేరు పురపాలికలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రక్షాళన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆయా పురపాలికలపై కాంగ్రెస్‌ జెండా ఎగిరినప్పటికీ అధికారులు, సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పాలకవర్గం కొలువుదీరి రెండు నెలలు గడవకముందే బడ్జెట్‌ సమావేశాలతో కలుపుకొని రెండు దఫాలు సమావేశాలు జరిగాయి. పురపాలికల్లో చోటు చేసుకున్న తప్పిదాలు, లోప భూయిష్టతను ఎండగట్టేందుకు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికార యంత్రాంగం సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసింది. పురపాలికల్లో అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. పుర పాలనలో కాంగ్రెస్‌ పెద్దలున్నా.. ఏం జరుగుతుందోననే అంశంపై దృష్టి సారించారు. అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి వీడకపోతే సెలవుపై వెళ్లాలంటూ పుర సమవేశంలో బాహాటంగా హెచ్చరిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత పాలకుల హయాంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.. ఏ దశలో ఉన్నాయని తెలుసుకునేందుకు కౌన్సిలర్లు 45 రోజులుగా అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నా స్పందన కరువైంది. దీనికితోడు పాలకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల గురించి అనుకూలంగా, ప్రతికూలంగా ఎమ్మెల్యేకు చేర వేస్తున్నారు.

తీసుకొచ్చిన రూ.18 కోట్ల పైచిలుకు పనులు ఏ దశలో ఉన్నాయి, ఎక్కడ ఆగిపోయాయి, ఎందుకు ఆగాయి.. అసలే ప్రారంభం కాని పనులేమిటి?

తాగునీటి సరఫరా కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏయే ప్రదేశాల్లో ఎప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రతి వార్డులో ఎన్ని వీధిదీపాలు ఉన్నాయి.. ఇంకా ఎన్ని కావాలి.

వార్డుల వారీగా ఉన్న బోరుమోటార్లు.. ఎన్ని పని చేస్తున్నాయి. మరమ్మతుకు గురైనవి ఎన్ని?

కాంగ్రెస్‌ పాలనలో ఏ నిధులతో భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఎక్కడెక్కడ పూర్తి చేశారు. ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయి.

తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీలు ఎక్కడ ఉన్నాయి. మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతుంది.

అమృత్‌ 2.0 పథకం ఏ దశలో ఉంది.

తాగునీటి పథకాల మోటర్లు ఎక్కడెక్కడ మరమ్మతుకు గురయ్యాయి. బాగున్నవి ఎన్ని. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవకుండా ఏం చేయాలి.

పుర ట్రాక్టర్ల డీజిల్‌ ఖర్చు ఎంత

పార్కులు ఉన్న వార్డులు ఎన్ని. లేని వార్డులు ఎన్ని.

బోరుబావులు ఎక్కడెక్కడ వేశారు. వేసిన వాటి పరిస్థితి ఏమిటి.

ఆయా ప్రశ్నలకు పుర అధికారులు సమాధానం చెప్పకపోవడం పాలకవర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ నెల 6వ తేదీలోగా పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని ఎమ్మెల్యే కోరగా.. అధికారులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతేగాకుండా ఆస్తి పన్నుల్లో రివైజ్డ్‌ పేరుతో హెచ్చుతగ్గులు, ట్రేడ్‌ లైసెన్స్‌ కొలతల్లో వ్యత్యాసాలు, ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, మెప్మా విభాగంలోని మహిళా సంఘాల రుణాల రికవరీలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు కూడా పుర అధికారులపై ఉన్నాయి.

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారదర్శక పాలన అందించాలి. పాలనలో తప్పిదాలు, లోపాలు చోటుచేసుకుంటే, అవినీతికి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్‌ హయంలో ప్రజలకు మేలు జరగాలనేదే మా పంతం.

– తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement