వనపర్తి రూరల్: జిల్లాలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు, యువతను ప్రోత్సహించి క్రీడలను అభివృద్ధి చేయడమే తొలి ప్రాధాన్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర స్పోర్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం వారు పెబ్బేరులో పర్యటించి పీజేపీ క్యాంపు ఆవరణలోని ఖేలో ఇండియా ఫుట్‌బాల్ మైదానం, క్రీడాకారుల సౌకర్యార్థం కలెక్టర్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా శాట్ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కలెక్టర్ చూపుతున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. పీజేపీ క్యాంపు ఆవరణలో ఉన్న పురపాలికకు చెందిన పది ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాధికార సంస్థ పేరున బదిలీ చేస్తూ తీర్మానిస్తే రూ.2.50 కోట్లతో మైదానం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారి జర్మన్ సాంకేతికతతో ఫుట్‌బాల్, హాకీ మైదానాలను టర్ప్‌తో పాటు 400 మీటర్ల ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్థలాన్ని వెంటనే సర్వేచేసి హద్దులు నిర్ధారించి పురపాలిక ద్వారా తీర్మానం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, పుర అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఖేలో ఇండియా ఫుట్‌బాల్ మైదానంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్‌ను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వారి వెంట పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, కృష్ణకుమార్‌రెడ్డి, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ రోజారెడ్డి తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇంటి పరిశీలన..
పెబ్బేరులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నిర్మాణంలో పురోగతి, చెల్లింపుల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని, లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో చెల్లించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో 143 ఇళ్లకుగాను 83 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని.. పనులు త్వరితగతిన ప్రారంభించి లక్ష్యాలను చేరుకోవాలన్నారు.


