చెయ్యెత్తిన పల్లెలు..
2వ విడతలోనూ కాంగ్రెస్ హవా
● 565 జీపీల్లో
327 మంది సర్పంచ్‌లుగా గెలుపు
● 169 గ్రామ పంచాయతీల్లో బీఆర్‌ఎస్.. 30 చోట్ల బీజేపీ మద్దతుదారులు..
● ఉమ్మడి పాలమూరు జిల్లాలో
సగటున 85.80 శాతం పోలింగ్
● చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా
ముగిసిన ఎన్నికలు
● 17న చివరి దశ ఎన్నికలు.. నేటితో ప్రచారం సమాప్తం
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. 565 జీపీల్లో 46 ఏకగ్రీవం పోను మిగిలిన 519 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డు స్థానాలకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఇందులో మొత్తంగా 327 పంచాయతీల్లో ‘హస్తం’ మద్దతుదారులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 169 చోట్ల ‘కారు’ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీకి చెందిన 30 మంది, మరో 39మంది ఇతరులు/స్వతంత్రులు గెలుపొందారు. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంది. పలు చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులను విజయం వరించగా.. రీకౌంటింగ్‌లతో ఉత్కంఠ నెలకొంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో అభ్యంతరాలతో రాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. చెదురుముదురు ఘటనలు మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
సర్పంచ్‌గా ‘దోశబండి’ వెంకటేష్
నవాబుపేటలో దోశబండి నడుపుతూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ సర్పంచ్‌గా గెలుపొందారు. మండలంలోని కామారం గ్రామానికి
చెందిన ఈయన కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచారు. ఈ క్రమంలో వెంకటేష్‌కు 471 ఓట్లు రాగా.. ప్రత్యర్థి బీఆర్‌ఎస్ మద్దతుదారు లింగంకు 388 ఓట్లు రావడంతో వెంకటే్‌ష్ 83 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో స్థానికులు దోశబండి వెంకటేష్ ఇకనుంచి సర్పంచ్ వెంకటేష్ అయ్యాడంటూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో కనీస సౌకర్యాల కల్పన, పాఠశాల అభివృద్ధే లక్ష్యమన్నారు.
– నవాబుపేట
తమ్ముడిపై అన్న గెలుపు
కొల్లాపూర్ మండలం రామాపురంలో సర్పంచ్ స్థానానికి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొమ్మ నాగరాజు, బీఆర్‌ఎస్ మద్దతుతో కొమ్మ గోపాల్ సర్పంచ్ బరిలో నిలిచారు. గోపాల్‌కు 876 ఓట్లు రాగా, నాగరాజుకు 570 ఓట్లు వచ్చాయి. దీంతో తమ్ముడిపై అన్న గోపాల్ 306 మెజార్టీతో విజయం సాధించారు. – కొల్లాపూర్ రూరల్
ఓటు కోసం దుబాయి నుంచి
ఓటు విలువను గుర్తించిన ఓ వ్యక్తి సర్పంచ్ ఎన్నికల్లో వినియోగించుకోవడానికి ఏకంగా దుబాయ్ నుంచి వచ్చాడు. మరికల్‌కు చెందిన భాస్కర్ దుబాయ్‌లో స్థిరపడగా మరికల్ సర్పంచ్ అభ్యర్థిగా బంధువులు పోటీ చేశారనే విషయాన్ని తమవారు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో భాస్కర్ రెండు రోజుల క్రితమే దుబాయ్ నుంచి మరికల్‌కు వచ్చి.. గురువారం ఓటుహక్కు వినియోగించుకున్నారు.
– మరికల్
బ్యాలెట్‌లో కనిపించని గుర్తు.. బ
వనపర్తి మండలం చిమనగుంటపల్లి 8వ వార్డు పోలింగ్ కేంద్రంలో వార్డు అభ్యర్థికి కేటాయించిన సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్‌లో ముద్రించలేదు. వార్డులో 260 ఓట్లుండగా అప్పటికే 50 మంది ఓటు వేశారు. తర్వాత ఓటు వేయడానికి వెళ్లిన ఒకరు సిలిండర్ గుర్తు లేదని చెప్పడంతో బాధిత అభ్యర్థి ఆందోళనకు దిగడంతో గంటపాటు పోలింగ్ నిలిచింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని అప్పటికే ఓట్లు వేసిన బాక్సును సీజ్ చేసి కొత్త బాక్సు ఏర్పాటుచేసి పోలింగ్ ప్రారంభించారు. అప్పటికే ఓటు వేసిన 50 మంది ఓటర్లను తిరిగి ఓటు వేయించడంతో గొడవ సద్దుమణిగింది. కాగా.. సిలిండర్ గుర్తుకు కేవలం 33 ఓట్లు రావడంతో ఆ అభ్యర్థి ఓడిపోయారు. – వనపర్తి రూరల్
17న చివరి విడత పోలింగ్..
రెండో విడతలో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఉప సర్పంచ్ అభ్యర్థులను సైతం ఎన్నుకున్నారు. తుది విడతకు సంబంధించి సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా.. 17న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పలుచోట్ల చెదురుమదురు ఘటనలు..
● నారాయణపేట జిల్లా ధన్వాడలో ఎన్టీఆర్ కాలనీ వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరగగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పంపించారు.
● నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో బీఆర్‌ఎస్ మద్దతుదారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అదే పార్టీకి చెందిన రెబల్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ సర్పంచ్ మద్దతుదారు చంద్రకళ, రెబల్‌గా పోటీలో ఉన్న సౌమ్య వర్గీయులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే బాహాబాహీకి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
మహబూబ్‌నగర్: 98 కాంగ్రెస్.. 39 బీఆర్‌ఎస్
జిల్లాలోని 151 జీపీల్లో రెండో విడతలో పోలింగ్ జరిగింది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హన్వాడ, దేవరకద్రలోని సీసీకుంట, కౌకుంట్ల దేవరకద్ర.. జడ్చర్లలోని మిడ్జిల్.. నారాయణపేటలోని కోయిల్‌కొండ మండలాల పరిధిలో 98 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 39 జీపీల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది, ఆరు చోట్ల ఇతరులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు.
నాగర్‌కర్నూల్: పోటాపోటీ..
జిల్లాలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజీపేట.. కొల్లాపూర్ సెగ్మెంట్‌లోని పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని 151 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 78 జీపీల్లో కాంగ్రెస్ బలపరిచిన వారు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 60 చోట్ల బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇతరులు ఏడుగురు, బీజేపీకి చెందిన ఆరుగురు గెలుపొందారు.
నారాయణపేట : కాంగ్రెస్‌దే పైచేయి..
జిల్లాలోని ఈ నియోజకవర్గ పరిధిలో దామరగిద్ద, ధన్వాడా, నారాయణపేట, మరికల్ మండలాల్లో 95 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 52 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు.. 18 పంచాయతీల్లో బీఆర్‌ఎస్, 13 జీపీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 12 గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు.
వనపర్తి: సగం.. సగం
జిల్లాలోని వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట, మదనాపురం, మక్తల్‌లోని ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలో 94 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 55 పంచాయతీల్లో హస్తం, 28 జీపీల్లో బీఆర్‌ఎస్, రెండింట బీజేపీ మద్దతుదారులు, తొమ్మిది మంది స్వతంత్రులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు.
జోగుళాంబ గద్వాల:
కాంగ్రెస్ 44.. బీఆర్‌ఎస్ 24
జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో మల్దకల్, అలంపూర్‌లో అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో మొత్తం 74 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 44 జీపీల్లో కాంగ్రెస్, 24 పంచాయతీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఒక బీజేపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌లుగా గెలుపొందారు.
6,98,844 మంది ఓటేశారు..
ఉమ్మడి పాలమూరులో రెండో విడతలో ఎన్నికల్లో మొత్తంగా 8,17,196 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 4,05.182, మహిళలు 4,11,998, ఇతరులు 16 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,49,192 మంది, మహిళలు 3,49,192 మంది, ఇతరులు ఐదుగురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 6,98,844 మంది ఓటు వేశారు. మొత్తంగా 85.80 శాతం పోలింగ్ నమోదైంది.
అమెరికా టు సంకిరెడ్డిపల్లి
కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అమర్‌రెడ్డి గత కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చి గురువారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో జరిగే ప్రతి ఎన్నికలోనూ తాను వచ్చి ఓటు వేస్తానని ఆయన పేర్కొన్నారు.
– కొత్తకోట రూరల్


