ప్రశాంతంగా రెండోవిడత ఎన్నికలు
వనపర్తి: జిల్లాలో ఆదివారం జరిగిన రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. నాచహళ్లిలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఉదయం కలెక్టర్ సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకుందామని ఓటర్లకు సూచించారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. తర్వాత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ను జిల్లా ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టుతో కలిసి పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో నిలిచిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేసినట్లు వివరించారు. రెండోవిడత పోలింగ్ జరిగిన వనపర్తి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో మొత్తం 1,03,406 ఓట్లు.. 87 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్ ఉన్నారు.


