‘విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం’
వనపర్తి: మూడువిడతల గ్రామపంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులోనే ఉంటుందని.. గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, ఊరేగింపులు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల తొలివిడత ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎంసీసీ అమలులో ఉన్నంతకాలం ఈ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమించే ఏ చర్యనైనా సహించమని, ఉల్లంఘనలు జరిగితే వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యతని.. శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
చిన్నారెడ్డి
మద్దతుదారు విజయం
గోపాల్‌పేట: మండలంలోని జయన్న తిరుమలాపురంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి జ్యోతి ఎమ్మెల్యే మేఘారెడ్డి బలపర్చిన అభ్యర్థి జానమ్మపై 270 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పుట్టపాకల రాజును ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని, గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు.
ఒక్క ఓటుతో విజయం..
ఖిల్లాఘనపురం: మండలంలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సోళీపురం సర్పంచ్‌గా సింధూజ ఒకేఒక్క ఓటుతో విజయం సాధించారు. సింధూజకు 1,006 ఓట్లు రాగా, తన సమీప అభ్యర్థి పద్మశ్రీకి 1,005, మరో అభ్యర్థి నవీన్‌కు 42 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా అత్యధికంగా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మద్దతుదారు ఆగారం పద్మశ్రీ తన సమీప అభ్యర్థి బీజేపీ మద్దతుదారు కృష్ణవేణిపై 1,476 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పెద్దమందడిలో...
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మద్దతుదారు సూర గంగమ్మ 640 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అత్యల్పంగా మోజర్లలో కాంగ్రెస్ మద్దతుదారు కానాయపల్లి శేఖర్ 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


