పేదలకు చేరువగా న్యాయసేవలు
వనపర్తిటౌన్: పేదలకు న్యాయసేవలు చేరువ చేయడంతో పాటు వారికి అండగా నిలిచేందుకు న్యాయ సేవాధికార సంఽస్థ కృషి చేస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌కోర్టు న్యాయమూర్తి వి.రజని అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌లో ఉన్న సీఆర్సీ కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలో న్యాయపరమైన సమస్యల పరిష్కారం, న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అర్హులైన వారికి ఉచితంగా న్యాయసాయం అందించనున్నట్లు వెల్లడించారు. పేదల బస్తీలో ప్రారంభించిన లీగల్ సర్వీస్ క్లినిక్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకొని న్యాయం పొందవచ్చన్నారు. ప్రతి సోమవారం లీగల్ క్లినిక్‌లో దరఖాస్తులు అందజేస్తే న్యాయ సేవాధికార సంస్థ పరిశీలించి బాధితులకు న్యాయపరంగా తోడుగా ఉంటుందని తెలిపారు. కూలీ పనులు చేసుకొంటూ కుటుంబాలను పోషించుకునే దళిత, పేదల బస్తీలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్‌తో ప్రజలకు సాంత్వన చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, పుర వార్డు అధికారి ఆకాశ్, పారా లీగల్ వలంటీర్లు అన్నపూర్ణ, రవీందర్, దళిత నేత గంధం నాగరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


