ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజావాణితో పాటు సీఎం ప్రజావాణి నుంచి వచ్చే వినతులు, సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు మొత్తం 56 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్‌లో మండల అధికారులు పాల్గొన్నారు.


