‘విశ్రాంత ఉద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలే..’
వనపర్తిటౌన్: విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.యేసేపు ఆరోపించారు. సోమవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది ఉద్యోగ విరమణ పొందిన 8,972 మందికి రూ.13 వేల కోట్ల బిల్లుల బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోందన్నారు. ఉద్యోగులతో జరిపిన చర్చల్లో ప్రతి నెలా రూ.700 కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా విశ్రాంత ఉద్యోగులకు డబ్బులు రాక అనారోగ్యం బారినపడి కొందరు చికిత్స చేయించుకోలేక మృతిచెందారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణాలు చేసుకోలేక కుటుంబంలో అశాంతితో ఆయువు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయోజనాలు అందక మానసిక క్షోభతో మరణించిన రిటైర్డ్ ఉద్యోగుల మరణాలను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామని తెలిపారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డాకుల అగ్గిరాముడు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, నాయకులు ఐ.నారాయణ, శ్రీనివాస్‌గౌడ్, కె.శ్రీనివాస్‌గౌడ్, డి.సత్యనారాయణమూర్తి, ఎం.కేశవులు, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
‘విశ్రాంత ఉద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలే..’


