అన్ని దుకాణాలు సిండికేట్లకే..
● స్థానికులదే అగ్రభాగం.. కడప, కర్నూలు వ్యాపారుల భాగస్వామ్యం
● కొత్తవారిని వరించిన లక్కు
వనపర్తి: కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపునకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో లక్కీడిప్ నిర్వహించారు. డిసెంబర్ నుంచి ప్రారంభమై రెండేళ్లపాటు కొనసాగే కొత్త మద్యం పాలసీలో లక్కు కొత్తవారినే ఎక్కువగా వరించింది. 40కి పైగా దరఖాస్తులు వేసిన జిల్లాకేంద్రం, పెబ్బేరు ప్రాంతాలకు చెందిన పాత సిండికేట్లకు ఈసారి నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. జిల్లాలోని మొత్తం 36 మద్యం దుకాణాలను లక్కీడిప్ విధానంలో కేటాయించగా.. అందులో అగ్రభాగం కొత్తవారికి దక్కడం గమనార్హం. జిల్లాకేంద్రంలోని ఆరు దుకాణాలకుగాను నాలుగు కొత్త వారికి, రెండు పాత సిండికేట్ గ్రూప్‌లు దక్కించుకోగా.. కొత్తకోట, పానగల్, పెబ్బేరులో కొత్తవారికి దక్కాయి. మదనాపురం, ఆత్మకూర్ ప్రాంతాల్లో పాతవారే మరోసారి దుకాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని దుకాణాలు దక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న సిండికేట్లలో కర్నూలు, కడప ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపారులు భాగస్వామం ఉన్నట్లు సమాచారం. కొన్ని సిండికెట్లలో 45 మందికి పైగా వ్యాపారులు భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. గోపాల్‌పేటలోని ఓ దుకాణం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సిండికేట్‌కు దక్కినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. ఒక్కో దుకాణానికి 55 నుంచి 60 వరకు దరఖాస్తులు వచ్చాయి. దుకాణాల వారీగా దరఖాస్తు చేసుకున్న వారి సమక్షంలో లక్కీడిప్ తీసి కేటాయించారు. లక్కీడిప్ ప్రక్రియను తిలకించేందుకు వీలుగా కలెక్టరేట్ ఆవరణలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 36 దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ లక్కీడిప్ నిర్వహించే హాల్‌లోకి అనుమతించడం సాధ్యం కాదని.. ఒక్కోసారి ఐదు నుంచి ఆరు దుకాణాల దరఖాస్తుదారులను సీరియల్ నెంబర్ల వారీగా పిలిపించారు. దుకాణం దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజులో 1/6 వంతు నగదు చెల్లించాల్సి ఉంటుందని వారితో సంతకాలు తీసుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి లోపలి వరకు పోలీస్, ఎకై ్సజ్‌శాఖ సిబ్బంది గస్తీ నిర్వహించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన లక్కీడిప్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంట లోపు పూర్తయింది.
అన్ని దుకాణాలు సిండికేట్లకే..


