అమరుల త్యాగాలు చిరస్మరణీయం
వనపర్తి: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించగా.. ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పోలీసు సమాజ సేవలో నిబద్ధతతో ముందుకుసాగి ప్రజల్లో సామాజిక బాధ్యత, దేశభక్తి స్ఫూర్తి పెంపొందించాలన్నారు. ప్రజా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయక దేశ సైనికుల్లా ముందుకు సాగుతున్న పోలీసుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. అమరుల త్యాగాలను స్మరించుకునేలా ఏటా పోలీస్ ఫ్లాగ్‌డే నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతో పాటు తమ దైనందిన జీవితంలో ఏదో ఒక వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి, కొత్తకోట సీఐలు కృష్ణయ్య, రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాత్రికేయులు, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్


