వసతుల కల్పనకే నిధులు మంజూరు
వనపర్తి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని.. వినియోగించుకొని పనులు వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే పనులు ప్రారంభించి ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లో మనోధైర్యం నింపడం కూడా బాధ్యతని, అప్పుడప్పుడు విద్యార్థులతో మమేకమై వారిలో ఆత్మవిశ్వాసాన్ని, చిన్న చిన్న విషయాలకు కుంగిపోకుండా భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. కేవలం పాఠాలే కాకుండా మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కూడా కీలకమన్నారు. అపార్ ఐడీ పునరుద్ధరణలో వేగం పెంచాలని, విద్యార్థులు చదువు మధ్యలో మానేయకుండా విధిగా కళాశాలలకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఐఈఓ ఎర్ర అంజయ్య, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


