ప్రజలకు నిరంతరం సేవలందించాలి
● కేసుల దర్యాప్తులో ప్రమాణాలు పాటించాలి
● ఎస్పీ రావుల గిరిధర్
కొత్తకోట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకొనేలా ఉత్సాహంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. గురువారం పట్టణ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని పెండింగ్ కేసులు, అందుకుగల కారణాలు, దర్యాప్తు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పత్రాలు, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులు ఛేదించాలని సూచించారు. ఎస్‌ఐలు తమ పరిధిలోని గ్రామాల్లో క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ఉండి ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలని సూచించారు. ఆన్‌లైన్, సైబర్ మోసాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్, డిజిటల్ అరెస్టులు, పోలీస్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మకూడదని కోరారు. సైబర్ మోసానికి గురైన మొదటి గంటలోపు టోల్‌ఫ్రీ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని లేదా https://www. cybercrime.gov.in/ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామం, వీధి, పరిశ్రమలు, పవిత్ర స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డయల్ 100 ఫిర్యాదులకు త్వరగా స్పందిస్తూ ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా తదితర వాటిని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలని కోరారు. సమీక్షలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ, ఐటీ కోర్, కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


