పత్తిపై.. కపాస్ కత్తి
వారం రోజుల్లో..
విక్రయాలకు గుదిబండగా మారిన స్లాట్ బుకింగ్ విధానం
●
నారాయణపేట: భారత పత్తి సంస్థ (సీసీఐ) కొత్త నిబంధనలతో పత్తి రైతులకు కొత్త కష్టాలు ఆరంభమయ్యాయి. పత్తి కొనుగోలులో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పత్తి రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇకపై పత్తి అమ్మకాలకు ‘కపాస్ కిసాన్’ యాప్‌లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇది స్మార్ట్‌ఫోన్ లేని, చదువు రాని వృద్ధ రైతులకు తలనొప్పిగా మారింది. యాప్ వాడకం, వివరాల నమోదుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. ఈ యాప్‌పై రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ యార్డులలో హెల్ప్‌డె స్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతుండగా.. గ్రామస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రతి రైతు వేదికలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 29 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తొలిసారిగా నారాయణపేట జిల్లా ధన్వాడ సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో బుధవారం తొలి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
వ్యాపారుల్లో ఆందోళన
సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో సీసీఐ అధికార యంత్రాంగం ఉమ్మడి పాలమూరులోని ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుతో వ్యవహరిస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎల్1, ఎల్2, ఎల్3 మిల్లులు కేటాయించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో బేల్స్ వారీగా కేటాయింపు చేశారు. అయితే ఏ మండలం రైతులు ఆ మండలంలో ఉండే కాటన్ మిల్లులో విక్రయించేందుకు వీలుగా అవకాశం క ల్పించాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఎల్–1 నిండిన తర్వాతే ఎల్–2 మిల్లుకు కేటాయించడం.. ఆ యాప్‌లో కనిపిస్తుందనే నిబంధన పెట్టడంతో అటు రైతులు.. ఇటు మిల్లర్లు సైతం ఆందోళన చెందుతున్నారు.
8 శాతానికి మించితే..
రైతులు తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉన్న పత్తిని తీసుకురావాల్సి ఉంటుంది. అత్యధికంగా 8 శాతం తేమ ఉంటే రూ.8,110 మద్దతు ధర లభిస్తుంది. అంతకు మించి పెరిగే ఒక్కొక్క శాతానికి రూ.81 ధర తగ్గుతుంది. తేమ శాతం 9 ఉంటే రూ.7,929– 8,028, 10 శాతం ఉంటే రూ.7,849– 7,947, 11 శాతం ఉంటే రూ.7,769– 7,866, 12 శాతం ఉంటే రూ.7,689– 7,785 మద్దతు ధరగా నిర్ధారించారు. అంత కంటే ఎక్కువ తేమ శాతం ఉంటే పత్తి ప్రైవేట్‌లో అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.
వినియోగం ఇలా..
కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి విక్రయానికి ముందు రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను ఆయా ప్రాంత వ్యవసాయ విస్తరణాధి కారులు (ఏఈఓ) వద్ద నమోదు చేసుకోవాలి. పంట వివరాలను నమోదు చేసుకునే సమయంలో ఓటీపీ కోసం ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోన్ నంబర్ తప్పుగా నమోదై ఉంటే దానిని ఏఈఓతో సరిచేయించుకోవాలి. స్మార్ట్‌ఫోన్ లోని ప్లే స్టోర్‌లో కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారానే రైతులు తాము ఏ రోజు పత్తిని విక్రయించాలనుకుంటున్నారో మాతృభాషలో స్లాట్ బుక్ చేసుకోవాలి. పత్తిని విక్రయించే మార్కెట్ లేదా మిల్లు ఎంపిక చేయాలి. విక్రయించే పత్తి పరిమాణాన్ని క్వింటాళ్లలో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే జిల్లాలో ఒక సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. మక్తల్, నారాయణపేట మార్కెట్ యార్డు పరిధిలోని మిగతా కాటన్ మిల్లులోనూ వారం రోజుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రైతులు సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయించి లబ్ధిపొందాలి.
– బాలమణి, డీఎంఓ, నారాయణపేట
సీసీఐ కొనుగోలు కేంద్రాల
ఏర్పాటులోనూ గందరగోళం
నిబంధనలపై రైతులు, అమ్మకాలపై వ్యాపారుల్లో ఆందోళన
ఉమ్మడి జిల్లాకు 29 కేటాయింపు.. పేటలో తొలికేంద్రం ప్రారంభం
మార్కెట్ యార్డులలో
హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు
పత్తిపై.. కపాస్ కత్తి


