జిల్లాలో 400 కొనుగోలు కేంద్రాలు
ఖిల్లాఘనపురం: రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో 400 వరిఽ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేధికలో ధాన్యం కొనుగోలుపై కేంద్రాల నిర్వాహకులు, ఏఈఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత అంచనాల ప్రకారం జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా ఐకేపీ, సింగిల్‌విండోల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. ఇప్పటికే 60 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే 40 వేల బ్యాగులు వస్తాయని తెలిపారు. గతంలో ధాన్యం రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురైనట్లు రైతులు, అధికారులు చెప్పారని.. ఈసారి పునరావృతం కాకుండా ముందుగానే లారీలు కేటాయిస్తామని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రోజు ఓ లారీ కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. కేంద్రాల నిర్వహణలో తేడాలు జరిగినా, రైతులను ఇబ్బందులకు గురిచేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. టార్పాలిన్లు, తాగునీరు, తూకపు, తేమ గుర్తించే యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏఈఓలు రైతులకు అవసరమైన టోకన్లు రాయాలని, గ్రామాలకు కేటాయించిన రైస్‌మిల్లుకు మాత్రమే ధాన్యం తరలించాలని ఆదేశించారు. ఽసన్న, దొడ్డు రకం ధాన్యాన్ని కచ్చితంగా గుర్తించాలని చెప్పారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, సింగిల్‌విండో మండల చైర్మన్ మురళీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, తహసీల్దార్ సుగుణ, ఏపీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడుకు 1,076 క్యూసెక్కుల వరద
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి గురువారం జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వ నుంచి 46 క్యూసెక్కులు, మొత్తం 1076 క్యూసెక్కుల వరద చేరినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగులు ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు.


