
కలెక్టర్ల అభిమతం ప్రజాభీష్టం కావాలి
వనపర్తి టౌన్: కలెక్టర్ల అభిమతం ప్రజాభీష్టమైతే మేలు చేకూరుతుందని.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు చేరువవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఏఐసీసీ కార్యదర్శి డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో ఎస్‌ఆర్ శంకరన్ స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో ఎస్‌ఆర్ శంకరన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌ఆర్ శంకరన్ అధికారిగా ఉన్న కాలంలో ఆయన నిర్ణయాలకు మంత్రులు సైతం ఎదురు చెప్పేందుకు భయపడేవారని, ఇందుకు ప్రజామోదమైన ఆయన ఎజెండానే కారణమని తెలిపారు. ఉన్నతాధికారులు ఆయన మాదిరిగా సాధారణ జీవితానికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకరన్ సారథ్యంలోనే నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపారని గుర్తు చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు శంకరన్‌నే కారణమని.. ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ పొందిన తర్వాత తనకు వచ్చే పింఛన్ డబ్బులను సైతం నిరుపేద దళిత, గిరిజనుల ప్రగతికి ఖర్చు చేశారని తెలిపారు. నేటితరం అధికారులందరికీ స్ఫూర్తిదాతగా, ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర కన్వీనర్ డా.మురళీధర్, రిటైర్డ్ ఎంఈఓ, న్యాయవాది రాఘవరెడ్డి, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్‌గౌడ్, ఎస్‌ఆర్ శంకరన్ స్ఫూర్తివేదిక కన్వీనర్, న్యాయవాది శశిభూషణ్, ప్రజా వాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ పాల్గొన్నారు.